బీహార్ జైలులో బర్త్ డే పార్టీ

బీహార్ లోని సీతామర్హి జైల్లో రెండు హత్యలు చేసిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు పింటూ తివారీ. అతడు జైల్ లోనే జన్మదినోత్సవాన్ని తన ఇంట్లో జరుపుకున్నట్లే అంగరంగ వైభవంగా జరుపుకున్నాడు.

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ పుట్టిన రోజు వీడియో ఇప్పుడు బీహార్ జైళ్ల లోని పరిస్థితులను వివరిస్తున్నది. ఈ వీడియోలో నేరస్తుడు పింటూ తివారీ కేక్ కట్ చేయడం, తన తోటి ఖైదీల నుంచి బహుమతులు అందుకోవడం, వారితో పాటు కలిసి విందు భోజనం చేయటం కనిపిస్తుంది.

ట్విట్టర్ లో హల్ చల్ చేస్తున్న ఈ వీడియో బీహార్ పోలీసుల పనితనం ఏ పాటిదో మరోసారి నిరూపించింది.  మొన్నీమధ్య బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా అంత్యక్రియల్లో పాల్గొన్న పోలీసుల 21 తుపాకీలు పేలకుండా మౌనంగా ఉండి పోయాయి. పేల తాయో లేదో చూసుకోకుండా వచ్చి దివంగత మిశ్రాను పోలీసులు అవమాన పరచారని చాలామంది ఈ సంఘటనను చూసి విమర్శించారు.

ఇప్పుడు బీహార్ జైల్లోనే కరడుగట్టిన హంతకుడు పింటూ జైలు ఆవరణలోనే జన్మ దినోత్సవాన్ని జరుపుకోవడం చూసిన జనం ఇది వింతేమీ కాదని అంటున్నారు.

డీజీపీని ఈ విషయం పై స్పందించమని అడుగగా “నేను జైళ్ల శాఖ ఐజి తో మాట్లాడాను. ఆయన ఒక విచారణ బృందాన్ని నియమించారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది” అని చెప్పారు.

బీహార్ లో పలుకుబడిగల వారికి జైల్లో సకల మర్యాదలు జరుగుతాయనే విషయం కొత్తేమి కాదు. ఈమధ్య సునీత చౌదరి రాసిన ఓ పుస్తకంలో దేశంలోని జైళ్లలో ఖైదీల పట్ల ఎంత వివక్ష గా జైలు సిబ్బంది వ్యవహరిస్తున్నారో కనిపిస్తుంది. ఆ వివక్షకు ఈ బీహార్ ఉదంతం కూడా ఒక నిదర్శనంగా నిలుస్తుంది.