టీ-20 క్రికెట్ కు మిథాలీ గుడ్ బై

  • వన్డే ప్రపంచకప్ కోసమే టీ-20కి రిటైర్మెంట్

భారత మహిళా క్రికెట్లో సీనియర్ ప్లేయర్ల రిటైర్మెంట్ కు తెరలేచింది. వెటరన్ స్టార్, భారత వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్…టీ-20 ఫార్మాట్ నుంచి రిటైరవుతున్నట్లు… బీసీసీఐకి తెలిపింది.

2021లో జరిగే వన్డే ప్రపంచకప్ కు పూర్తిస్థాయిలో సిద్ధం కావడం కోసం…టీ-20 క్రికెట్ కు దూరమవుతున్నట్లు మిథాలీ వివరించింది. వన్డే ఫార్మాట్లో భారతజట్టుకు మిథాలీ నాయకత్వం వహిస్తుంటే…టీ-20 ఫార్మాట్లో హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ గా వ్యవహరిస్తోంది.

2వేల పరుగుల భారత తొలిమహిళ….

టీ-20 ఫార్మాట్లో 2వేలకు పైగా పరుగులు సాధించిన భారత తొలి మహిళా క్రికెటర్ గా రికార్డు నెలకొల్పిన మిథాలీ.. భారతజట్టులో సభ్యురాలిగా మూడు ప్రపంచకప్ టోర్నీలలో పాల్గొంది. 2006లో భారత మహిళా టీ-20 తొలి అంతర్జాతీయ మ్యాచ్ లో మిథాలీనే కెప్టెన్ గా వ్యవహరించింది.

36 ఏళ్ల మిథాలీ మొత్తం 36 టీ-20 మ్యాచ్ ల్లో భారతజట్టుకు నాయకత్వం వహించింది.

మూడు ప్రపంచకప్ టోర్నీలలో నాయకత్వం…

2012, 2014, 2016 సంవత్సరాలలో శ్రీలంక, బంగ్లాదేశ్, భారత్ వేదికగా జరిగిన ప్రపంచ టీ-20 మహిళా టోర్నీలలో మిథాలీ కెప్టెన్సీలోనే భారత్ పోటీకి దిగింది.

మిథాలీ తన టీ-20 కెరియర్ లో మొత్తం 89 మ్యాచ్ లు ఆడి..97 నాటౌట్ స్కోరు అత్యధికంగా మొత్తం 2 వేల 364 పరుగులతో 37.5 సగటు నమోదు చేసింది.

అంతేకాదు…203 వన్డేలలో 6వేల 720 పరుగులు, 10 టెస్టు మ్యాచ్ ల్లో 663 పరుగులు సాధించిన రికార్డులు సైతం మిథాలీకి ఉన్నాయి.

భారత్ కు ప్రపంచకప్ సాధించిపెట్టాలన్నదే తన జీవిత లక్ష్యమని…వచ్చే ప్రపంచకప్ లో ఆ కల నెరవేరుతుందని గట్టిగా నమ్ముతున్నట్లు మిథాలీ ప్రకటించింది.