విరాట్ కొహ్లీ దాతృత్వం

  • యువటెన్నిస్ ఆటగాడికి కొహ్లీ ఫౌండేషన్ అండ
  • కొహ్లీ సాయంతో సత్తా చాటిన సుమిత్ నగాల్

భారత క్రికెట్ జట్టును ముందుండి విజయపథంలో నడిపిస్తున్న ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ విరాట్ కొహ్లీ.. తనపేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ తో.. క్రికెటేతర క్రీడలకు చెందిన ప్రతిభావంతులైన క్రీడాకారులను ఆర్థికంగా ఆదుకొంటూ వెనకుండి ముందుకు నడిపిస్తున్నాడు.

భారత్ లో అత్యంత జనాదరణ పొందిన ఆటగాడిగా, ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ క్రికెటర్ గా వివిధ రూపాలలో ఏడాదికి 200 కోట్ల రూపాయల వరకూ ఆర్జిస్తున్న విరాట్ కొహ్లీ తాను సంపాదిస్తున్న మొత్తంలో కొంత భాగాన్ని సామాజిక సేవ కోసం ఉపయోగిస్తున్నాడు.

విరాట్ కొహ్లీ ఫౌండేషన్ పేరుతో ఏర్పాటు చేసిన సంస్థ ద్వారా అండగా నిలుస్తూ ఆర్థికసాయం అందిస్తున్నాడు.

క్రికెటేతర క్రీడలకు 2 కోట్లు…

క్రికెటేతర క్రీడల్లో ప్రతిభావంతులైన క్రీడాకారుల ఆర్థిక సాయం కోసం కొహ్లీ తన సంపాదన నుంచి 2 కోట్ల రూపాయలతో ఓ ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశాడు. నిధుల కొరతతో అల్లాడుతున్న ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఊతమిస్తున్నాడు.

న్యూయార్క్ వేదికగా జరుగుతున్న 2019 యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ మెయిన్ డ్రాకు అర్హత సాధించిన అత్యంత పిన్నవయస్కుడైన భారత క్రీడాకారుడు సుమిత్ నగాల్ కు కొహ్లీ ఫౌండేషనే ఆర్థికసాయం అందచేసింది.

అమెరికన్ ఓపెన్ తొలిరౌండ్లో 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విన్నర్ రోజర్ ఫెదరర్ చేతిలో ఓడినా ఓ సెట్ నెగ్గిన ఘనత సొంతం చేసుకొన్న సుమిత్ నగాల్.. తన ఈ ఘనత వెనుక విరాట్ కొహ్లీ ఫౌండేషన్ ప్రోత్సాహం, అండదండలు ఉన్నాయని ప్రకటించాడు.

కొహ్లీ ఫౌండేషన్ లేకపోతే తాను లేనంటూ సుమిత్ నగాల్ కృతజ్ఞతలు తెలిపాడు. కెనడాలో ఓ టెన్నిస్ టోర్నీ ఆడి జర్మనీ చేరుకొనే సమయానికి తన చేతిలో కేవలం 6 డాలర్లు మాత్రమే ఉన్నాయని…అలాంటి దిక్కుతోచని స్థితిలో తనకు కొహ్లీ ఫౌండేషన్ అండగా నిలిచి ఆర్థికసాయం అందించిందని నగాల్ గుర్తు చేసుకొన్నాడు.

2017 నుంచి తనకు కొహ్లీ ఫౌండేషన్ ఆర్థికసాయం అందిస్తూ వచ్చినట్లు ప్రకటించాడు.

ఆటల ద్వారా వందల కోట్లు సంపాదించడమే కాదు…అందులో కొంత మొత్తాన్ని క్రికెటేతర క్రీడల కోసం ఖర్చు చేయాలన్న కొహ్లీ లక్ష్యం ఎంతైనా అభినందనీయం.