గణేష్‌ మండపంలో మంటలు… కార్లు, బైకులు దగ్దం

హైదరాబాద్‌ మల్కాజ్‌గిరిలోని ఒక గణేష్‌ మండపంలో మంటలు చెలరేగాయి. మండపంలో ఏర్పాటు చేసిన దీపం కారణంగా రాత్రి మంటలు చెలరేగాయి. విష్ణుపురి కాలనీలోని మైత్రీనివాస్ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది. అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో మండపం ఏర్పాటు చేయగా అక్కడున్న దీపం కారణంగా మంటలు చెలరేగాయి.

సెల్లార్‌లో పార్క్ చేసిన రెండు కార్లు, 10 ద్విచక్ర వాహనాలు కాలిబూడిదయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా వారు వచ్చి మంటలు అదుపులోకి తెచ్చారు. ప్రాణనష్టం జరగకుండా అపార్ట్‌మెంట్ వాసులను రక్షించారు. అయితే మంటల దాటికి అపార్ట్‌మెంట్‌ పిల్లర్లు కూడా దెబ్బతిన్నాయి. దాంతో అపార్ట్‌మెంట్‌ ధృడత్వంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అదృష్టవశాత్తు మంటలు సెల్లార్‌కు మాత్రమే పరిమితమయ్యాయి. పైకి వ్యాపించి ఉంటే మరింత నష్టం జరిగి ఉండేదని భావిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో సెల్లార్లలో మండపాల ఏర్పాటు సమయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.