ఊరి పేరు మీరే చెప్పండి… శాంతిభద్రతలపై చర్చకు మేం సిద్ధం…

రాష్ట్రం బాగుపడుతుంటే చంద్రబాబునాయుడు చూస్తూ తట్టుకోలేకపోతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కే ట్యాక్స్, సీ ట్యాక్స్, ఎల్‌ ట్యాక్స్…. అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు మాఫియాలను నడిపారన్నారు.

టీడీపీ బాధితులతో శిబిరం ఏర్పాటు చేస్తే కరకట్టే కాదు విజయవాడ కూడా జనసంద్రం అవుతుందన్నారు. పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చుకుని చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారన్నారు.

రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా శాంతిభద్రతలపై చర్చకు సిద్ధమని… దమ్ముంటే టీడీపీ వాళ్లు సవాల్‌ను స్వీకరించాలన్నారు. గ్యాంగ్‌స్టర్లు, ఫ్యాక్షనిస్టులు, రేపిస్టులు అంతా టీడీపీలోనే ఉన్నారన్నారు.

రాష్ట్రం ఎక్కడ బాగుపడిపోతుందో అని గ్యాంగ్‌స్టర్లు అంతా కలిసి పెట్టుబడులు రాకుండా తప్పుడు కథనాలు రాయిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. కానీ ఆ ఎత్తులేవి ఫలించవన్నారు.

వంద రోజుల్లోనే ఉద్దానం బాధితుల కోసం పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామని, తిత్లీ తుపాను బాధితులకు నష్టపరిహారం మొత్తం చెల్లించామన్నారు.

వంద రోజుల్లోనే పేకాట క్లబ్బులు లేకుండా చేశామన్నారు. పెంచిన పించన్లను అమలులోకి తెచ్చామన్నారు. నాలుగు లక్షల ఉద్యోగాలు వంద రోజుల్లోనే ఇచ్చామన్నారు. చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని పనులను వంద రోజుల్లోనే తాము చేసి చూపించామన్నారు గడికోట శ్రీకాంత్ రెడ్డి.

తెలంగాణ ప్రభుత్వం కూడా అప్పులు తెచ్చిందని… కానీ అక్కడ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులు వంటివి నిర్మించారని.. కానీ లక్షల కోట్లు అప్పు తెచ్చిన చంద్రబాబు నాలుగు టెంపరరీ భవనాలు తప్ప రాష్ట్రానికి శాశ్వతంగా ఉపయోగపడే ఒక్క పనైనా చేశారా? అని శ్రీకాంత్ రెడ్డి నిలదీశారు.