యూఎస్ ఓపెన్ క్వార్టర్స్ లో స్పానిష్ బుల్

  • నాలుగోటైటిల్ కు ఉరకలేస్తున్న నడాల్

స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్..యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ కు దూసుకెళ్లాడు. తన కెరియర్ లో నాలుగో అమెరికన్ ఓపెన్ టైటిల్ కు గురిపెట్టాడు.

న్యూయార్క్ లోని అర్థర్ యాష్ స్టేడియం వేదికగా ముగిసిన ప్రీ-క్వార్టర్ ఫైనల్లో రెండోసీడ్ నడాల్ నాలుగు సెట్ల పోరులో మాజీ చాంపియన్ మారిన్ సిలిచ్ ను అధిగమించాడు.

తన ట్రేడ్ మార్క్ టెన్నిస్ తో చెలరేగి ఆడిన నడాల్ 6-3, 3-6, 6-1, 6-2తో సిలిచ్ ను ఇంటిదారి పట్టించాడు. గతంలో 2010, 2013, 2017 సీజన్లలో యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన నడాల్ కు తన కెరియర్ లో ఇది 40వ గ్రాండ్ స్లామ్ క్వార్టర్ ఫైనల్స్ బెర్త్ కాగా..యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ చేరడం తొమ్మిదోసారి.

సెమీఫైనల్లో చోటు కోసం జరిగే క్వార్టర్స్ సమరంలో అర్జెంటీనా జెయింట్, 20వ సీడ్ డియాగో ష్వార్జ్ మాన్ తో నడాల్ తలపడతాడు.

మరో ప్రీ-క్వార్టర్ ఫైనల్ పోటీలో జర్మన్ ఆటగాడు ,5వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరేవ్ ను 3-6, 6-2, 6-4, 6-3 తో డియాగో ఓడించి క్వార్టర్స్ బెర్త్ ఖాయం చేసుకొన్నాడు.