Telugu Global
NEWS

రాష్ట్రంలో శాంతి... బాబులో అశాంతి... తనపై దాడి చేయాలని పిలుపు...

ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. గతంలో ప్రభుత్వాలు మారినప్పుడు కనీసం తొలి ఆరు నెలల పాటు ప్రతీకార దాడులుండేవి. కానీ జగన్‌ సీఎం అయ్యాక ఒక్కచోట కూడా అలాంటి ప్రతీకార హత్యలు గానీ, దాడులు గానీ లేవు. పైగా ఇప్పటికీ టీడీపీ మాజీ ఎమ్మెల్యేలే నోరు పారేసుకోవడం, దాడులు చేయడం వంటివి చేస్తూ దొరికిపోతున్నారు. వ్యక్తిగత అంశాల ఆధారంగా ఎక్కడైనా ఇరు వర్గాలు ఘర్షణ పడితే దానికి ఎల్లో రంగు, వైసీపీ రంగు పూసి నారా […]

రాష్ట్రంలో శాంతి... బాబులో అశాంతి... తనపై దాడి చేయాలని పిలుపు...
X

ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. గతంలో ప్రభుత్వాలు మారినప్పుడు కనీసం తొలి ఆరు నెలల పాటు ప్రతీకార దాడులుండేవి. కానీ జగన్‌ సీఎం అయ్యాక ఒక్కచోట కూడా అలాంటి ప్రతీకార హత్యలు గానీ, దాడులు గానీ లేవు. పైగా ఇప్పటికీ టీడీపీ మాజీ ఎమ్మెల్యేలే నోరు పారేసుకోవడం, దాడులు చేయడం వంటివి చేస్తూ దొరికిపోతున్నారు.

వ్యక్తిగత అంశాల ఆధారంగా ఎక్కడైనా ఇరు వర్గాలు ఘర్షణ పడితే దానికి ఎల్లో రంగు, వైసీపీ రంగు పూసి నారా లోకేష్ ట్విట్టర్‌లో ప్రచారం చేయడం మినహా… రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి అని చాటేందుకు ఎల్లో మీడియాకు కూడా అవకాశం దక్కడం లేదు.

ఇలా రాష్ట్రం ప్రశాంతంగా ఉండడం బహుశా చంద్రబాబును అశాంతికి గురి చేస్తున్నట్టుగానే ఉంది. రోజూ… ఇంటికి టీడీపీ కార్యకర్తలు పిలిపించుకుని వారి చేత అయ్యో ఏదో జరిగిపోతోందంటూ ఫోజులు ఇప్పిస్తున్న చంద్రబాబు… అయినా పెద్దగా స్పందన లేకపోవడంతో ఒక విచిత్రమైన పిలుపునిచ్చారు. దమ్ముంటే వైసీపీ వాళ్లు తనపై దాడి చేయాలంటూ 40 ఏళ్ల ఇండస్ట్రీ పొలిటిషియన్ చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఇలా పిలుపునివ్వడం ద్వారా రాష్ట్రంలో ప్రత్యర్థులను రెచ్చగొట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు వాలకం చూస్తుంటే తనపై తానే దాడి చేయించుకుని… పరిటాల రవి హత్య తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వందలాది ఆర్టీసీ బస్సులను తగలబెట్టించినట్టుగా రాష్ట్రంలో అలజడి రేపేందుకు కూడా వెనుకాడేలా లేరని అధికార పార్టీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

చంద్రబాబు ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలను మునుముందు ఇంకా తెగించి చేస్తారని… కానీ ఆ ట్రాప్‌లో తాము పడబోమని వైసీపీ నేతలంటున్నారు. అసలు తప్పుడు కేసులు ఎక్కడ పెట్టామో చెప్పాలని అధికార పార్టీ నిలదీస్తోంది.

కోడెల శివప్రసాద్… అసెంబ్లీ ఫర్నిచర్‌ను దొంగలించింది నిజం కాదా? ఆయన కుమారుడు, కుమార్తె ‘కే’ ట్యాక్స్ వసూలు చేసింది నిజం కాదా?, రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మందులను కోడెల కుమార్తె కంపెనీ నుంచి సరఫరా చేసింది నిజం కాదా?, అక్రమంగా కోడెల కుమారుడు బైక్‌ షోరూంలో రిజిస్ట్రేషన్ లు చేసింది నిజం కాదా?, కోడెల శివరాం శాటిలైట్ పైరసీ చేసింది నిజం కాదా?,…. కూన రవికుమార్ వీడియో సాక్షిగా అధికారులను నోటికొచ్చినట్టు దూషించింది నిజం కాదా?, యరపతినేని మైనింగ్ అక్రమాలు నిజమని స్వయంగా హైకోర్టునే వ్యాఖ్యానించింది నిజం కాదా?, వైసీపీ దళిత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని టీడీపీ నేతలు కులం పేరుతో అవమానించింది నిజం కాదా?, సదావర్తి భూములను కాజేసేందుకు టీడీపీ పెద్దలు ప్రయత్నించింది నిజం కాదా?, చింతమనేని ప్రభాకర్ వికృత వేషాలు ఇప్పటికీ కొనసాగిస్తున్నది నిజం కాదా?… అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఇలా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తే అది కక్షసాధింపు అని చంద్రబాబు చెప్పడం ఏమిటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

First Published:  3 Sep 2019 9:47 PM GMT
Next Story