23వేల ఫైన్… బండినే అప్పగించిన యువకుడు

ఇటీవల కేంద్ర ప్రభుత్వం నూతన మోటార్ వాహన చట్టం అమలులోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం వేసే జరిమానాలు కళ్లు బైర్లు కమ్మేలా ఉన్నాయి. లైసెన్స్ లేకపోతే ఐదు వేలు, వయసులేకున్నా డ్రైవింగ్ చేస్తే 10వేలు, ఓవర్ స్పీడ్‌కు రెండు వేలు, తాగి నడిపితే పదివేలు, వాహనానికి పర్మిట్ లేకపోతే 10వేలు, హెల్మెట్ లేకపోతే వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తున్నారు.

అయితే ఢిల్లీలో ట్రాఫిక్ పోలీసులకు మాత్రం ఊహించని అనుభవం ఎదురైంది. దినేష్‌ మదన్‌ అనే వ్యక్తి స్కూటర్‌లో వెళ్తుండగా పోలీసులు ఆపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, బండికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకపోవడం, హెల్మెట్ ధరించకపోవడం, పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోవడం వంటి పలు ఉల్లంఘనలను కలిపి 23వేలు ఫైన్ వేశారు. అయితే బండికి సంబంధించిన పత్రాలు ఉన్నాయని… ఇంటికి వెళ్లి పది నిమిషాల్లో వాట్సాప్‌ ద్వారా పంపిస్తానని చెప్పినా వినకుండా ఫైన్ వేశారని దినేష్ ఆరోపిస్తున్నాడు.

పోలీసులు మాత్రం తమ చర్యను సమర్ధించుకుంటున్నారు. నిబంధనలను తాము అమలు చేశామన్నారు. దినేష్‌ 23వేల రూపాయల ఫైన్ చెల్లించేందుకు అంగీకరించలేదు. తాను వాడుతున్న సెకండ్ హ్యాండ్ స్కూటర్‌ విలువ కేవలం 15వేలు మాత్రమేనని… కాబట్టి దాని కోసం 23 వేలు ఫైన్ కట్టే పరిస్థితుల్లోలేనని స్పష్టం చేశారు. స్కూటర్‌ను మీరే తీసుకెళ్లండి అని పోలీసులకు స్కూటర్‌ ను అప్పగించేశాడు.