బర్త్ డే కేక్.. ఆ తండ్రి కొడుకులను చంపేసింది.

ఒక్క బర్త్ డే కేక్.. ఆ ఇంట్లో విషాదాన్ని నింపింది. కొడుకు బర్త్ డేను ఘనంగా నిర్వహించాలని కేక్ తెప్పించిన ఆ తండ్రి.. తిన్న తనయుడు కూడా కాటికి పోయిన హృదయ విదారక సంఘటన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం ఐనాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

ఐనాపూర్ గ్రామానికి చెందిన రమేష్, భాగ్యలక్ష్మీ దంపతులకు కుమారుడు రాంచరణ్, కూతురు పూజిత ఉన్నారు. కుమారుడు రాంచరణ్ 9వ పుట్టినరోజును ఘనంగా నిర్వహించడానికి కేక్ తెప్పించాడు. అదే వారి ప్రాణాలు తీస్తుందని వారికి తెలియదు..

కొడుకు కేక్ కట్ చేశాడు.. తండ్రి కొడుకుకు తినిపించాడు. అనంతరం తండ్రికి కూడా కొడుకు కేక్ తినిపించారు. తల్లికి తినిపించాడు. అప్పటివరకు సంతోషంగా ఉన్న ఆ కుటుంబాన్ని కేక్ మృత్యువు ఒడిలోకి తీసుకెళ్లింది.

కేక్ తిన్న తండ్రి రమేష్, కొడుకు రాంచరణ్ మృతిచెందారు. తల్లి భాగ్యలక్ష్మీ, కుమార్తె పూజితలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

కాగా ఈ కేకును తెప్పించింది స్వయానా రమేష్ సోదరుడే కావడం అనుమానాలకు తావిస్తోంది. రమేష్ కు, ఇతడి సోదరుడికి భూ తగాదాలున్నాయి. ఈ కసితోనే కేక్ లో విషం కలిపి వీరి ప్రాణాలు తీశాడా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.