నమ్మినోళ్లకు కాంగ్రెస్ లో అన్యాయమేనా?

పార్టీని నమ్మి.. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి.. శ్రమనంతా ధారపోసి.. బీజేపీ నేతలతో కయ్యానికి కాలుదువ్విన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు వరుసగా జైలు పాలు అవుతున్నారు. ఈ హఠాత్పరిణామానికి వాళ్లు కృంగిపోతున్నారు. వాళ్ల అనుయాయులు ఇప్పుడు పార్టీ అధిష్టానంపై మండిపడుతున్నారు.

తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేతలు చిదంబరం, డీకే శివకుమార్ లను జైలుకు పంపింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. అమిత్ షా హోంమంత్రిగా వ్యవస్థలను, వాటి లూప్ హోల్స్ ను ఆధారంగా చేసుకొని ఆయనను ఇబ్బంది పెట్టిన చిదంబరంను, కర్ణాటక సీనియర్ నేత డీకేశివకుమార్ ను జైలుకు పంపారు.

ఇంత జరుగుతున్నా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని, హోంమంత్రి అమిత్ షాను ఎదురించడంలో.. దీనిపై పెద్ద ఉద్యమాలు చేయడంలో కాంగ్రెస్ అధిష్టానం విఫలమవ్వడం సగటు కాంగ్రెస్ వాదులను తీవ్ర నిరాశకు గురిచేస్తోందట.

డీకే శివకుమార్ స్వయంగా రాజకీయ పునర్జన్మ ఇచ్చిన అహ్మాద్ పటేల్ కూడా శివకుమార్ విషయంలో స్పందించకపోవడంపై పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి.

ఇప్పటికైనా కాంగ్రెస్ సీనియర్ల అరెస్ట్ పై కాంగ్రెస్ అధిష్టానం పోరుబాట పట్టాలని.. లేకపోతే తప్పుచేసిన వారిగా ప్రజల దృష్టిలో కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ తలదించుకోకతప్పదని కాంగ్రెస్ వాదులు రగిలిపోతున్నారట..