అవకాశాలు రావాలంటే ఓ పద్ధతి ఉంటుంది…. వేధింపులపై బన్నీ వాసు క్లారిటీ

ఫిలింఛాంబర్ గేట్స్ కు తననుతాను గొలుసులతో కట్టేసుకొని సునీత బోయ నానా రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్లిన విషయం కూడా తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారానికి కారణమైన బన్నీ వాసు స్పందించాడు. సునీత బోయ వ్యవహారశైలి బాగాలేదంటున్నాడు బన్నీ వాసు.

“అమ్మాయి (సునీత బోయ) మమ్మల్ని కలిసింది. జనసేనలో పనిచేశాను, ఏదైనా పాత్రలు ఇవ్వమని కోరింది. మేం కూడా మా యూనిట్ కు ఏమైనా పాత్రలు ఉంటే చూడమని చెప్పాం. కానీ సునీత బోయ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. జనసేనకు పనిచేసింది కాబట్టి పాత్రలు ఇవ్వాలని లేదు. నువ్వు ఆడిషన్స్ కు వెళ్లానని చెప్పావ్. అందులో సెలక్ట్ అయితే కచ్చితంగా పాత్ర వస్తుంది. ఆడిషన్స్ పై మేం అంతగా ఫోకస్ పెట్టం. హీరోహీరోయిన్లు తప్ప మిగతావాళ్ల గురించి మేం అంతగా పట్టించుకోం. మేం వేరే పనుల్లో ఉంటాం. నిన్ను అడ్డుకోవాల్సిన అవసరం లేదు.”

పాత్రల కోసం సునీత బోయ అనుసరించిన విధానం బాగాలేదంటున్నాడు బన్నీ వాసు. ఒక రోజు షూటింగ్ కోసం లక్షలు ఖర్చుపెట్టే తాము, ఇలాంటి వ్యవహారశైలి ఉన్న వ్యక్తుల్ని లొకేషన్ లో పెట్టుకొని పనిచేయలేమన్నాడు. మోసం చేశాం అనే పెద్ద పదాన్ని సునీత వాడారని, అందుకే ఇలా వీడియో రిలీజ్ చేయాల్సి వచ్చిందంటున్నాడు బన్నీ వాసు.

“సునీత బోయకు పరిస్థితులు హ్యాండిల్ చేయడం రావడం లేదు. గేట్ దగ్గర గొలుసులు కట్టేసుకొని, నాకెందుకు అవకాశాలు ఇవ్వరని అగ్రెసివ్ గా మాట్లాడితే అవకాశాలు రావు. అవకాశాలు రావాలంటే ఓ పద్ధతి ఉంటుంది. ఆ ప్రాసెస్ లోనే వెళ్లాలి. నా పిల్లలైనా ఆ ప్రాసెస్ లో వెళ్లాల్సిందే. నువ్వు (సునీల్) మమ్మల్ని అప్రోచ్ అయిన విధానం బాగాలేదు.”

పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన తర్వాత లొకేషన్ కు వచ్చిన సునీత బోయ, ఆత్మహత్యాయత్నం చేసిందని.. ఇంతకంటే తన గురించి చెప్పడానికి ఏముందంటున్నాడు బన్నీ వాసు. సునీతకు, తమకు మధ్య కేవలం సినిమా అవకాశాలు ఇవ్వలేదనే క్లాష్ తప్పితే.. ఇతరత్రా వ్యవహారాలు ఏమీ లేవని బన్నీ వాసు క్లారిటీ ఇచ్చాడు. పలు వెబ్ సైట్స్ లో వస్తున్నట్టు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఈ వివాదంలో లేవని స్పష్టంచేశాడు.