Telugu Global
NEWS

రాజేందర్ కు రసమయి బాలకిషన్‌ తోడు

తెలంగాణ రాష్ట్ర్ర సమితిలో లుకలుకలు తగ్గడం లేదు. పుట్టలోంచి పాములు ఒక్కొక్కటీ బయటకు వచ్చినట్లుగా పార్టీ నాయకులు తమ ఆగ్రహంతో బయటపడుతున్నారు. మొన్న మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు ఈటెల రాజేందర్ గళం విప్పితే… నేడు మరో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తెలంగాణపై తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “నేను కూడా రాజేందర్ అన్న వంటి వాడినే. అందుకే ఏదీ కడుపులో దాగదు. తెలంగాణ కోసం ఎన్ని కలలు కన్నాం. ఎంత మార్పు వస్తుందని […]

రాజేందర్ కు రసమయి బాలకిషన్‌ తోడు
X

తెలంగాణ రాష్ట్ర్ర సమితిలో లుకలుకలు తగ్గడం లేదు. పుట్టలోంచి పాములు ఒక్కొక్కటీ బయటకు వచ్చినట్లుగా పార్టీ నాయకులు తమ ఆగ్రహంతో బయటపడుతున్నారు. మొన్న మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు ఈటెల రాజేందర్ గళం విప్పితే… నేడు మరో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తెలంగాణపై తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

“నేను కూడా రాజేందర్ అన్న వంటి వాడినే. అందుకే ఏదీ కడుపులో దాగదు. తెలంగాణ కోసం ఎన్ని కలలు కన్నాం. ఎంత మార్పు వస్తుందని ఆశించాం.
ఇప్పుడు అవన్నీ కల్లలు అవుతున్నట్లుగానే ఉంది ” అని రసమయి బాలకిషన్ తన ఆవేదన వ్యక్తం చేశారు.

పాఠశాలలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఉన్న బోర్డులు మారాయని, ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ అని ఉంటే ఇప్పుడు తెలంగాణ అని మారిందే తప్ప పాలనలోను, ప్రగతిలోను ఎలాంటి మార్పు రాలేదని రసమయి బాలకిషన్ అన్నారు. కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఓ సమావేశంలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో రసమయి బాలకిషన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “నేను 15 సంవత్సరాలు పని చేసిన సిద్దిపేట జిల్లా ఇంద్రగూడెం వెళ్లాను. అక్కడే ఉపాధ్యాయుడిగా పని చేశాను. నా ఊరు, నేను పని చేసిన పాఠశాల చూడాలని చాలా ఉత్సాహంగా వెళ్లాను. అక్కడ ఎలాంటి మార్పు లేదు” అని రసమయి ఆవేదన వ్యక్తం చేశారు. తాను పని చేసిన పాఠశాలలో అప్పట్లో ఒక్కటే తరగతి గది ఉండేదని, తాను ఒక్కడినే ఉపాధ్యాయుడ్ని అని చెప్పిన రసమయి ఇప్పటికీ అక్కడ అదే పరిస్థితి ఉందని చెప్పారు. “నేను పని చేసిన పాఠశాల మారలేదు. అప్పుడు ఒక్కటే గది. ఒక్కరే టీచర్. ఇప్పుడూ ఒక్కటే గది. ఒక్కరే టీచర్. బోర్డు మాత్రం ఆంధ్రప్రదేశ్ అని పోయి తెలంగాణ అని వచ్చింది” అని రసమయి ఆవేదన వ్యక్తం చేశారు.

తనకు కడుపులో ఒకటి పెట్టుకుని బయటకు మరొకటి మాట్లాడడం రాదని అన్నారు. “పొట్టలో ఏదో పెట్టుకుని మాట్లాడితే నా పొట్ట ఊరుకోదు. బయటకు రా అని అంటుంది. మేం ఉద్యమం నుంచి వచ్చినోళ్లం. వాస్తవాల మీద ఉద్యమాలను నడిపినోళ్లం” అని ఆయన అన్నారు.

తెలంగాణ ఎలా ఉండాలో ఎన్నో కలలు కన్నామని, ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే బాధనిపిస్తోందని అన్నారు. వారం రోజుల క్రితం పార్టీకి ఓనర్లం తామేనంటూ మంత్రి ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. ఇప్పుడు రసమయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. రసమయి బాలకిషన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సభలో మంత్రి ఈటెల రాజేందర్ కూడా ఉండడం, బాలకిషన్‌ను అలా మాట్లాడకూడదని చెప్పడం విశేషం.

First Published:  6 Sep 2019 12:26 AM GMT
Next Story