సాహో బరిలో ఉన్నప్పటికీ తగ్గట్లేదుగా!

సాధారణంగా ఓ పెద్ద సినిమా థియేటర్లలో ఉందంటే.. ఓ 2 వారాల పాటు మరో సినిమాకు చోటు ఉండదు. కంప్లీట్ గా 2 వారాల రన్ పూర్తయిన తర్వాతే ఇతర సినిమాలకు దారి ఉంటుంది. కానీ సాహో విషయంలో మాత్రం ఇలాంటి ఫార్మాలిటీస్ కనిపించడం లేదు. సినిమాకు నెగెటివ్ టాక్ రావడం, ఆక్యుపెన్సీ తగ్గడంతో ఈ వీకెండ్ ఇతర సినిమాలు థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 7 సినిమాలు క్యూ కట్టాయి.

ఈ వీకెండ్ ఆది సాయికుమార్, శ్రద్ధాశ్రీనాధ్ జంటగా నటించిన జోడీ సినిమా థియేటర్లలోకి వస్తోంది. వరుసగా ఫ్లాపులిస్తున్న ఆది సాయికుమార్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. లవ్-ఫ్యామిలీ ఎమోషన్స్ తో వస్తున్న ఈ సినిమా కచ్చితంగా ఆడుతుందంటున్నాడు. ఓవైపు సాహో ఉన్నప్పటికీ ఉన్నంతలో చెప్పుకోదగ్గ స్థాయిలోనే దీనికి థియేటర్లు దొరికాయి.

ఈ సినిమాతో పాటు ఉండిపోరాదే, దర్పణం, 2 అవర్స్ లవ్, నీ కోసం అంటూ మరికొన్ని సినిమాలు కూడా థియేటర్లలోకి వస్తున్నాయి. ఇవన్నీ చిన్న సినిమాలనే విషయాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా వీటి గురించి ప్రత్యేకంగా డిస్కషన్ కూడా అక్కర్లేదు. వీటిలో ఏదైనా ఆశ్చర్యకర విజయాన్ని నమోదుచేస్తే మాత్రం మాట్లాడుకోవాల్సిందే.

ఈ సినిమాలతో పాటు వీడే సరైనోడు, తారామణి అనే 2 డబ్బింగ్ సినిమాలు కూడా థియేటర్లలోకి వస్తున్నాయి. వీడే సరైనోడు సినిమాలో నయనతార ఉంది. తారామణి సినిమాలో ఆండ్రియా, అంజలి ఉన్నారు. వీళ్లు ఏమైనా ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేస్తే ఫలితం ఉంటుంది. లేదంటే ఇలా వచ్చి అలా వెళ్లడమే.