నాలుగో టెస్టులో స్టీవ్ స్మిత్ డబుల్ సెంచరీ షో

  • సూపర్ ఫామ్ లో కంగారూ మాజీ కెప్టెన్

ఆస్ట్ర్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ..తన ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ఆటతీరును కొనసాగిస్తున్నాడు.

ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదుమ్యాచ్ ల యాషెస్ సిరీస్ నాలుగో టెస్టు లో సైతం స్మిత్ చెలరేగిపోయాడు. డబుల్ సెంచరీతో తన జట్టు భారీస్కోరు సాధించడం లో ప్రధానపాత్ర వహించాడు.

మూడుటెస్టులు మూడు సెంచరీలు…

సిరీస్ లోని తొలిటెస్టు రెండు ఇన్నింగ్స్ లోనూ సెంచరీలు బాదడం ద్వారా మ్యాచ్ విన్నర్ గా, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన స్టీవ్ స్మిత్ ..ఆ తర్వాత డ్రాగా ముగిసిన రెండోటెస్టులో సైతం 92 పరుగులు సాధించి అవుటయ్యాడు.

ఏడాది నిషేధం తర్వాత తిరిగి టెస్టు క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చిన స్మిత్..యాషెస్ సిరీస్ మొదటి రెండుటెస్టుల్లో రెండు శతకాలు బాదడం ద్వారా తానేమిటో నిరూపించుకొన్నాడు.

రెండో టెస్ట్ ఆడుతూ ఫాస్ట్ బౌలర్ ఆర్చర్ బౌలింగ్ లో మెడకు తగిలిన బౌన్సర్ దెబ్బతో మూడోటెస్టుకు దూరమైన స్మిత్.. పదిరోజుల విశ్రాంతి అనంతరం… తిరిగి నాలుగోటెస్ట్ బరిలోకి దిగాడు.

సిరీస్ లో స్మిత్ తొలిడబుల్…

మాంచెస్టర్ టెస్ట్ తొలిరోజు ఆటలో అజేయ హాఫ్ సెంచరీ సాధించిన స్మిత్ రెండోరోజుఆట లంచ్ విరామానికి ముందు సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 11 బౌండ్రీలతో సాధించిన 100 పరుగులు ఉన్నాయి.లంచ్ విరామం తర్వాత సైతం స్మిత్ అదే జోరు కొనసాగించాడు. చివరకు డబుల్ సెంచరీ సాధించాడు.

స్మిత్ మొత్తం 310 బాల్స్ ఎదుర్కొని 22 బౌండ్రీలు, 2 సిక్సర్లతో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. టెస్ట్ క్రికెట్లో ఇప్పటి వరకూ 25 సెంచరీలు బాదిన స్టీవ్ స్మిత్ కు మూడు ద్విశతకాలు సైతం ఉన్నాయి.

గత ఏడాదికాలంగా ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ లో ఉన్న భారత కెప్టెన్ విరాట్ కొహ్లీని అధిగమించి స్టీవ్ స్మిత్ తిరిగి టాప్ ర్యాంక్ అందుకోగలిగాడు. తన ర్యాంక్ స్థాయికి తగ్గట్టుగా ఆడుతూ కేవలం మూడుటెస్టుల్లోనే 579 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.