అహోబిలం శిలలపై గాంధీ, నెహ్రు బొమ్మలున్నాయి…కేసీఆర్‌ బొమ్మ తొలగిస్తాం..

కేసీఆర్‌ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేస్తున్న యాదాద్రి ఆలయ కొత్త నిర్మాణ శిలలపై కేసీఆర్‌, టీఆర్‌ఎస్ ఎన్నికల గుర్తు కారు బొమ్మ ఉండడం దుమారం రేపింది. విపక్షాలు దీనిపై పెద్దెత్తున విమర్శలు చేస్తున్నాయి. ఆలయ శిలలపై కేసీఆర్‌, కారు బొమ్మలు ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఆలయ అధికారులు వివరణ ఇచ్చారు.

యాదాద్రి ఆలయ శిలలపై తమ బొమ్మలను చెక్కాలని కేసీఆర్‌ తమకు చెప్పలేదని… ఆలయానికి మహర్ధశ కేసీఆర్‌ హయాంలోనే వచ్చినందున, ఆ కోణంలోనే ఆయన బొమ్మ చెక్కారన్నారు. స్పూర్తినిచ్చిన దాన్ని ఆవిష్కరించేందుకు శిల్పులు ప్రయత్నించారన్నారు. కారు గుర్తే కాకుండా సైకిల్, ఎడ్లబండి వంటి గుర్తులు సప్త గోపురాలపై ఐదువేలకుపైగా ఉంటాయన్నారు.

ఈ బొమ్మలు ఉన్న స్ధంబాలు బాహ్యప్రాకారంలోనే ఉన్నాయన్నారు. ఆలయం లోపల ఉండే స్థంబాల్లో అన్నీ వైష్ణవ సంప్రదాయం ప్రకారమే చెక్కినట్టు తెలిపారు

అహోబిలం శిలలపై గాంధీ, నెహ్రు బొమ్మలు ఉండడాన్ని ఆలయ ప్రత్యేకాధికారి కిషన్ రావు గుర్తు చేశారు. తన బొమ్మలు ఉంచాల్సిందిగా కేసీఆర్‌ ఎక్కడా చెప్పలేదని… అభ్యంతరాలుంటే కేసీఆర్‌ బొమ్మను ఆలయ శిలలపై నుంచి తొలగిస్తామని కిషన్‌ రావు చెప్పారు.