ఇస్రో చైర్మన్ కన్నీళ్లు.. ధైర్యం చెప్పిన మోడీ

ఎంత కరుడుగట్టిన జాతీయ వాదిగా మోడీ కనిపించినా ఆయనలోని ప్రేమ, వాత్సల్యం, ఆప్యాయత అందరినీ కట్టిపడేస్తుంటుంది. తాజాగా అలాంటి ఘటన ఒకటి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. మోడీ చేసిన పనికి ఇప్పుడు నెటిజన్లు, అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 2 ప్రయోగం చివరి నిమిషంలో ఫెయిల్ అవ్వడంతో భారత ఇస్రో శాస్త్రవేత్తలు అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. భారత ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతుండగా పక్కనే ఉన్న ఇస్రో చైర్మన్ శివన్ అయితే కన్నీళ్లు అదిమిపట్టుకున్నాడు. ఆయన దిగిరాగానే కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో కన్నీటి పర్యంతమైన శివన్ ను ప్రధాని హత్తుకొని ఓదార్చారు. భుజం, వెన్నుతట్టి ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా భారత ప్రధాని శాస్త్రవేత్తలను తన ప్రసంగంలో కొనియాడారు. భారత మాత కోసం శాస్త్రవేత్తలు ఎన్నో త్యాగాలు చేశారని.. వారి కుటుంబాలకు తమ సెల్యూట్ అని చెప్పారు. ప్రయోగాలను ఫలితాలు ఆపలేవని.. వెనకడుగు వేసే ప్రసక్తే లేదని.. శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలకు గర్వపడుతున్నామని మోడీ పేర్కొన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద అంతరిక్ష ప్రయోగశాల అమెరికన్ నాసా చంద్రుడిపై ఉపగ్రహం పంపేందుకు పదిసార్లు విఫలమైందని.. కానీ మన ఇస్రో కక్ష్యలోకి పంపిందని.. అభినందనలతో ముంచెత్తారు. సైన్స్ లో ఫెయిల్యూర్ అనే మాటే లేదన్నారు. మన విజయాలకు భారీ కొలమానాలు పెట్టుకోవాలని ప్రధాని మోడీ పేర్కొని ధైర్యం చెప్పారు.