అఖిల్ కు డేట్స్ ఇచ్చిన పూజాహెగ్డే

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ సినిమాకు హీరోయిన్ కోసం చాన్నాళ్లు వెదికారు. ఫైనల్ గా పూజా హెగ్డేను సెలక్ట్ చేశారు. భారీ పారితోషికానికి ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకుంది పూజా హెగ్డే. ఇప్పుడీ ముద్దుగుమ్మ అఖిల్ సినిమాకు డేట్స్ ఇచ్చింది.

నిజానికి పూజా హెగ్డే ఇప్పుడు ఖాళీగా లేదు. ప్రభాస్ హీరోగా కొత్త సినిమా చేయాల్సి ఉంది. మరోవైపు వాల్మీకి సినిమాలో కూడా నటిస్తోంది. అయితే ప్రభాస్, రాధాకృష్ణ కుమార్ కాంబోలో వస్తున్న సినిమాను కొన్నాళ్లు నిలిపివేశారు. దీంతో పూజా హెగ్డే కాల్షీట్లు వృధా అవుతున్నాయి. సో.. ఆ కాల్షీట్లను అఖిల్ సినిమా కోసం కేటాయించింది పూజా హెగ్డే.

పూజా హెగ్డే హఠాత్తుగా అందుబాటులోకి రావడంతో అఖిల్ సినిమా యూనిట్ అలెర్ట్ అయింది. వెంటనే షూటింగ్ కు ఏర్పాట్లు చేసుకుంది. హీరోయిన్ కాల్షీట్లు అనుకోకుండా అందుబాటులోకి రావడంతో అటు అఖిల్ కూడా తన స్పెయిన్ హాలిడే ట్రిప్ ను మధ్యలోనే ఆపేసి హైదరాబాద్ వచ్చేశాడు. త్వరలోనే అఖిల్-పూజా హెగ్డే కాంబోలో సీన్స్ తీయబోతున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ కోసం మేకర్స్ చేయని ప్రయత్నం లేదు. స్టార్ హీరోయిన్స్ నుంచి కొత్త ముఖాల వరకు చాలామందిని ప్రయత్నించారు. చివరికి పూజా హెగ్డేను ఒప్పించగలిగారు. ఎట్టకేలకు హీరోయిన్ రాకతో అఖిల్ సినిమా వేగం పుంజుకుంది. గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు.