ఏడుకొండలపై ఏసు మందిరం అంటూ తప్పుడు ప్రచారం… టీడీపీ కార్యకర్తల అరెస్ట్

తిరుమలలో ఏసు మందిరం నిర్మించారంటూ తప్పుడు ప్రచారం చేయడం ద్వారా సమాజంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నించిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

తిరుమల కొండపై సెక్యూరిటీ గార్డ్ కోసం నిర్మించిన కట్టడంపై సీపీ కెమెరాల కోసం ఏర్పాటు చేసిన స్థంభాన్ని ఏసు శిలువగా మార్ఫింగ్‌ చేసి సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా ఈ యువకులు ప్రచారం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని… తిరుమల కొండపై ఏకంగా ఏసు మందిరం కట్టారని… ఇదిగో శిలువ అంటూ ప్రచారం సాగించారు.

ఈ విషయం టీటీడీ దృష్టికి రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ప్రచార మూలాలపై ఆరా తీసిన పోలీసులు గరికపాటి కార్తీక్‌ చౌదరి, అజితేశ్ చక్రవర్తి, అరుణ్‌లను అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు హైదరాబాద్‌లోని టీడీపీ సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తున్నట్టు పోలీసులు తేల్చారు. వారి వద్ద సెల్‌ ఫోన్లను సీజ్ చేశారు.

వీరిని ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేసేలా ప్రోత్సహించింది టీడీపీ సోషల్ మీడియా అడ్వైజర్ జయకాంత్ అని పోలీసుల విచారణలో తేలింది. జయకాంత్ మార్గదర్శకత్వంలోనే గరికపాటి కార్తీక్ చౌదరి… ఏడు కొండలపై వెలసిన ఏసు మందిరాలు అంటూ మార్ఫింగ్ ఫోటోలను సృష్టించి ప్రచారం మొదలుపెట్టాడు.

అటవీ విభాగానికి చెందిన భవనాన్ని చర్చిగా, సీసీ కెమెరాల స్థంభాన్ని శిలువగా చిత్రీకరించి ప్రచారం మొదలుపెట్టాడు. గరికపాటి కార్తీక్ చౌదరి…ఈ ఒక్క విషయంలోనే కాకుండా వీలు చిక్కినప్పుడల్లా వైసీపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడం, హిందువులను రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టడం వంటివి చేస్తున్నట్టు పోలీసులు విచారణలో తేలింది.

అరెస్ట్ అయిన ముగ్గురిని తిరుపతి రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి గోపాలకృష్ణ ముందు హాజరుపరచగా ఈనెల 19 వరకు రిమాండ్ విధించారు. అరెస్ట్ అయిన గరికపాటి కార్తీక్ చౌదరి కుటుంబం… హైదరాబాద్ భాగ్యనగర్‌ కాలనీలో నివాసం ఉంటుంది. కాటేపల్లి అరుణ్‌ కుటుంబం హైదరాబాద్ కేపీహెచ్‌బీలో ఉంటోంది. మిక్కిలినేని సాయి అజితేశ్ చక్రవర్తిది గుంటూరు జిల్లా పెదనందిపాడు.