సైరా ట్రయిలర్ రెడీ.. వచ్చే వారమే ముహూర్తం

చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా వస్తున్న సైరా సినిమాకు సంబంధించి ఇప్పటికే టీజర్ హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ట్రయిలర్ ను కూడా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. తాజాగా ట్రయిలర్ కట్ రెడీ అయింది. చిరంజీవి అనుమతి కూడా వచ్చేసింది. మంచి ముహూర్తం చూసి వచ్చే వారం విడుదల చేయాలని ప్లాన్ చేశారు.

నిజానికి సైరా ట్రయిలర్ ను కర్నూల్ లో జరగబోయే ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ దానికి ఇంకా డేట్ ఫిక్స్ అవ్వలేదు. పైగా అప్పటివరకు ఆపితే ప్రమోషన్ ఆలస్యం అవుతుందని భావిస్తున్నారు. అందుకే వచ్చే వారమే ట్రయిలర్ ను రిలీజ్ చేయాలని నిర్ణయించారు. కుదిరితే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ టైమ్ కు సాంగ్స్ ను సిద్ధం చేయాలనేది ఆలోచన.

టీజర్ లో ఎలాగైతే ప్రొడక్షన్ వాల్యూస్ కు ప్రాధాన్యం ఇచ్చారో, ట్రయిలర్ లో కూడా భారీతనానికే ప్రాధాన్యం ఇచ్చారు. ట్రయిలర్ చూస్తే సినిమా ఖర్చు మొత్తం కనిపించేలా ప్లాన్ చేశారు. అంతేకాదు, సినిమా స్టోరీలైన్ ను కూడా ఎలివేట్ చేస్తూ ట్రయిలర్ కట్ చేశారు.

ఇక ప్రచారంలో భాగంగా సైరా యూనిట్ కీలక నగరాల్లో పర్యటించాలని నిర్ణయించింది. కర్నూల్ లో ప్రీ-రిలీజ్ ఫంక్షన్ తర్వాత బెంగళూరులో మరో భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు. చెన్నైలో యూనిట్ సభ్యులందరితో ప్రెస్ మీట్, ముంబయిలో మరో ప్రెస్ మీట్ ప్లాన్ చేశారు. గ్యాప్ దొరికితే నార్త్ లోని పూణె, ఇండోర్ లాంటి మరికొన్ని పట్టణాల్లో కూడా పర్యటించే ఆలోచనలో చిరంజీవి ఉన్నారు.