బైక్ రేసింగ్ లో భారత మహిళా బులెట్లు

  • ప్రపంచ కప్ నెగ్గిన భారత తొలి మహిళ ఐశ్వర్య
  • 23 ఏళ్ల వయసులోనే అరుదైన ఘనత
  • జమ్మూ యువతి హుమైయిరా ముస్తాక్

గంటకు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే మోటార్ బైక్ రేసింగ్ లో పాల్గొనాలంటే మగధీరులే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అయితే…కట్టుబాట్లు, సాంప్రదాయాల నడుమ పెరిగిన భారత యువతులు బైక్ రేసింగ్ లో పాల్గొనటమే కాదు… ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నారు. భారత మహిళలకే గర్వకారణంగా నిలుస్తున్నారు.

కాలం మారింది. వేగం పెరిగింది. మారిన కాలంతో పాటు భారత సమాజం ఆలోచానా దృక్పథం, ఆచారాలు, అలవాట్లలో సైతం గణనీయంగా మార్పు వచ్చింది. తండ్రిచాటు బిడ్డలుగా పెరిగిన భారత నవతరం యువతులు మోటార్ బైక్ రేసింగ్ లో పాల్గొంటూ విశ్వవిజేతలుగా మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు.

ఇద్దరూ ఇద్దరే….

మహిళలు అంటే సుకుమారులు. ఇంటిపట్టునే ఉండి ఆడుకొనే చదరంగం, క్యారమ్ లాంటి క్రీడలకే పరిమితమయ్యే రోజులు పోయాయి. కేవలం పురుషులు మాత్రమే పాల్గొనే, పురుషులకు మాత్రమే పరిమితమైన కుస్తీ, వెయిట్ లిఫ్టింగ్, మోటార్ బైక్ రేసింగ్ లాంటి క్రీడల్లో సైతం పాల్గొంటూ వారేవ్వా అనిపించుకొంటున్నారు.

గంటకు 200 నుంచి 300 కిలోమీటర్ల మెరుపువేగంతో దూసుకుపోయే ప్రొఫెషనల్ బైక్ రేసింగ్ లో పాల్గొనటమే కాదు…తగిన ఆదరణ, ప్ర్రోత్సాహం ఉంటే మగధీరులతో సమానంగా రాణించగలమని బెంగళూరు బుల్లెట్ ఐశ్వర్య పిసాయ్ విశ్వవిజేతగా నిలవడం ద్వారా చాటి చెప్పింది.

బెంగళూరు బుల్లెట్ ఐశ్వర్య…

బెంగళూరు యువతి ఐశ్వర్య వయసు 23 సంవత్సరాలు. తల్లిదండ్రులు విడిపోడంతో వచ్చిన సమస్యలు ఓవైపు, నాన్న ప్రోత్సాహం అంతంత మాత్రంగానే ఉన్నా.. ప్రపంచకప్ మోటార్ బైక్ రేసింగ్ లో విజేతగా నిలిచిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించింది.

హంగెరీలోని వార్పలోటా వేదికగా ముగిసిన 2019 ఎఫ్ఐఎమ్ ప్రపంచకప్ మోటార్ రేసింగ్ మహిళ టైటిల్ ను
ఐశ్వర్య పిసాయ్ నెగ్గి భారత యువతులా… మజాకానా అనిపించుకొంది.

ఐదేళ్ల సాధనతోనే ప్రపంచ టైటిల్…

18 సంవత్సరాల వయసు నుంచే మోటార్ బైక్ నడపడం నేర్చుకొన్న ఐశ్వర్య పట్టుదలతో, మొండితనాలకు..నిరంతర సాధనను జోడించి..ప్ర్రొఫెషనల్ బైక్ రేసర్ స్థాయికి ఎదిగింది.

దుబాయ్ ఇసుక ఎడారులు, హిమాలయాలలోని మంచుపర్వతాలలో జరిగిన అంతర్జాతీయ బైక్ రేస్ ల్లో పాల్గొని సత్తా చాటుకొంది.

2019 మోటార్ స్పోర్ట్స్ సర్క్యూట్ మహిళల విభాగంలో..సీనియర్, జూనియర్ విభాగాలలో పాల్గొన్న ఐశ్వర్య..సీనియర్ విభాగంలో విశ్వవిజేతగాను, జూనియర్ విభాగంలో రన్నరప్ గాను నిలిచి భారత మహిళల సత్తా ఏపాటిదో ప్రపంచానికి చాటి చెప్పింది.

నాలుగు రేస్ ల్లోనూ టాప్

దుబాయ్ వేదికగా ముగిసిన తొలి అంచె రేస్ లో విజేతగా నిలిచిన ఐశ్వర్య..పోర్చుగల్ రేస్ లో మూడు, స్పెయిన్ రేస్ లో ఐదు, హంగెరీ రేస్ లో నాలుగు స్థానాలలో నిలవడం ద్వారా… మొత్తం 65 పాయింట్లతో ప్రపంచకప్ సొంతం చేసుకోగలిగింది.

పోర్చుగల్ కు చెందిన రీటా వియారా 61 పాయింట్లతో రన్నరప్ గా నిలిచింది.

జూనియర్ విభాగంలోనూ..

జూనియర్ విభాగంలోనూ పోటీకి దిగిన ఐశ్వర్య 46 పాయింట్లతో రెండో స్థానం సొంతం చేసుకొంది. చిలీకి చెందిన థామస్ డీ గవాడో 60 పాయింట్లతో ప్రపంచ జూనియర్ చాంపియన్ ట్రోఫీ అందుకొంది.

మొత్తం మీద..మోటార్ స్పోర్ట్ లో అడుగుపెట్టిన ఐదేళ్ల కాలంలోనే ఐశ్వర్య ఆరు జాతీయ టైటిల్స్ తో పాటు…విశ్వవిజేతగా కూడా నిలవడం ద్వారా.. భారత నవతరానికి స్ఫూర్తిగా, గర్వకారణంగా మిగిలింది.

జమ్మూ రేసర్ హుమైయిరా….

జమ్మూ-కాశ్మీర్..ఈ పేరు వినగానే అక్కడి మహిళలు, యువతులు సమాజం కట్టుబాట్ల నడుమ ఎంత ఉక్కిరిబిక్కిరై పోతుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన  పనిలేదు.

అయితే…జమ్మూలోని ఓ సాంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించిన 23 ఏళ్ల హుమైయిరా ముస్తాక్ వృత్తిరీత్యా డెంటిస్ట్. అయితే మోటార్ బైక్ లు నడపడం మాత్రం ప్రవృత్తిగా చేసుకొంది. హుమైయిరా బైక్ రేసింగ్ లో అడుగుపెట్టింది.

జాతీయ మహిళా మోటార్ బైక్ రేసింగ్ లో పాల్గొనటమే లక్ష్యంగా సాధన చేసింది. సమాజం ఏమనుకొన్నా తాను పట్టించుకోనని… తన కుటుంబం అండగా నిలిచినంత వరకూ ఏదైనా సాధించగలనని… ఎక్కడికైనా వెళ్లగలనన్న విశ్వాసం పెరిగిందంటూ పొంగిపోతోంది.

కోయంబత్తూరులో ఇటీవలే ముగిసిన జేకే టైర్ నేషనల్ రేసింగ్ లో పాల్గొనటమే కాదు…మెరుపు వేగంతో దూసుకుపోడం తనకు చెప్పలేని ఆనందాన్ని ఇచ్చిందని మురిసిపోతోంది.

ఇటు ఐశ్వర్య…అంటు హుమైయిరా లాంటి నవతరం యువతుల సాహసం చూస్తుంటే…భారత అమ్మాయిలా…మజాకానా అనుకోక తప్పదు మరి.