రాజధానిలో జగన్‌ చేసేది ఇదే…

జగన్‌ సీఎం అయినప్పటి నుంచి అమరావతి ఏమవుతుందో అన్న ఆందోళన ప్రజల్లో లేదు కానీ టీడీపీ వారిలో బాగా కనిపిస్తోంది.

ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి నోరు విప్పి ఏదో ఒకటి చెప్పాలి అని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ జగన్ వైపు నుంచి ఒక్క మాట కూడా రాజధానిపై లేదు. బొత్స సత్యనారాయణ మాత్రమే ఈ అంశంపై ప్రతిపక్షాలకు కౌంటర్ ఇస్తున్నారు. ఏదో ఒకటి ముఖ్యమంత్రి చెబితే దాని బట్టి కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నది ప్రతిపక్షాల ఆలోచన అయి ఉండవచ్చు.

జగన్‌ మౌనం, బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు బట్టి చూస్తే కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. రాజధానిని అమరావతి నుంచి మారుస్తాం అని ప్రభుత్వం అధికారికంగా, బహిరంగంగా ప్రకటించే అవకాశం లేదు. అలా అని చంద్రబాబు ఎంపిక చేసిన ప్రాంతంలో కొత్త నిర్మాణాలు కూడా జరిగే చాన్స్ లేదు. చంద్రబాబు అమరావతి ప్రస్తుతం నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయంతో సరిపెట్టుకోవాల్సి రావొచ్చు.

రాజధానిని అమరావతి నుంచి దొనకొండకు తరలిస్తారన్న ప్రతిపక్షాల ప్రచారం కూడా నిజం కాకపోవచ్చు. అమరావతి నుంచి దొనకొండకు రాజధాని మారుస్తామని ప్రకటిస్తే….. చూశారు వైసీపీ నేతలు అక్కడ భూములు కొనుక్కున్నారు కాబట్టి దొనకొండకు తీసుకెళ్తున్నారని ప్రతిపక్షాలు ప్రచారం చేయవచ్చు. దీని వల్ల జిల్లాల మధ్య కొత్త సమస్యలు రావొచ్చు.

జగన్ బహుశా ఇకపై అమరావతిలో కొత్తగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా కొత్తగా చేసే నిర్మాణాలను, వచ్చే పరిశ్రమలను వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేయవచ్చు. అలా చేస్తే తెలుగుదేశం పార్టీకి పెద్ద దెబ్బే.

ఒకవేళ రాయలసీమలో ఏదైనా సంస్థనే ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే.. లేదు అమరావతిలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసే పరిస్థితి టీడీపీకి ఉండదు. అలా చేస్తే రాయలసీమ ప్రాంతంలో టీడీపీకి ఇంకా దెబ్బ. ఒకవేళ విశాఖలో ఏదైనా సంస్థను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే దాన్ని వ్యతిరేకిస్తే ఉత్తరాంధ్రలో టీడీపీకి నష్టం. కాబట్టి అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తే చాలు.. అమరావతి గురించి ప్రజలకు జగన్ ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం ఉండదు.

అమరావతిలో కొత్తగా నిర్మాణాలు చేపట్టకపోతే చాలు.. ఇక అక్కడ రాజధాని ఏర్పాటు సహజంగానే శాశ్వతంగా ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చినా అమరావతిలో ఏదో చేసేయడం సాధ్యం కాదు. ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా తాము పెట్టుబడి పెట్టిన ప్రాంతం గురించి ప్రాధాన్యత మారిపోతుందని తెలిసిన తర్వాత ఆ ప్రాంతంలో కొత్తగా టీడీపీ వాళ్లు కూడా భూములుకొనడం, పెట్టుబడులు పెట్టడం లాంటి పనులు చేయరు.

మొత్తం మీద చూస్తే రాజధానిని తరలిస్తామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే అవకాశం లేదు. అమరావతిలో కొత్త నిర్మాణాలు చేసే అవకాశమూ లేదు. దొనకొండను రాజధానిగా ప్రకటించే అవకాశం కూడా లేదు. కొత్తగా ఏదైనా పరిశ్రమలు వచ్చినా, నిర్మాణాలు చేయాల్సి వచ్చినా వికేంద్రీకరణ వైపు ప్రభుత్వం మొగ్గు చూపవచ్చు. అమరావతిపై జగన్‌ మౌనమే టీడీపీకి, అక్కడ ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసి వందల ఎకరాలు కొన్న వారికి పెద్ద శిక్ష.

హైదరాబాద్‌ అనుభవం చూసిన తర్వాత భవిష్యత్తుల్లో ఏపీలోనూ ప్రాంతాల మధ్య విభేదాలు రాకూడదన్నా… ఒక ప్రాంతం అధిపత్యం, మిగిలిన ప్రాంతంపై లేకుండా ఉండాలన్నా…. వికేంద్రీకరణే సరైన మార్గం.