ఆర్భాటం కాదు.. కంటెంట్ కావాలి

టాలీవుడ్, కోలీవుడ్ మధ్య టేస్ట్ లో చాలా తేడా ఉంది. అందుకే ఏదైనా కోలీవుడ్ సినిమాను రీమేక్ చేసేటప్పుడు టాలీవుడ్ టేస్ట్ కు తగ్గట్టు మార్పులు చేస్తుంటారు. అలానే టాలీవుడ్-బాలీవుడ్ కు మధ్య కూడా తేడా ఉంది. ఇక్కడ పెద్దగా ఆకట్టుకోని సాహో సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయింది. అదే విధంగా భారతీయ సినిమాకు, చైనా మార్కెట్ కు మధ్య కూడా వ్యత్యాసం ఉంది. మరీ ముఖ్యంగా చైనీయులు, హంగు-ఆర్భాటం చూడరు. కేవలం కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే అక్కడ ఆడతాయి. దీనికి మరో ఎగ్జాంపుల్ గా నిలిచింది 2.O మూవీ.

భారత్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కింది 2.O చిత్రం. కానీ ఇప్పుడీ సినిమా చైనాలో దాదాపు డిజాస్టర్ గా పేరు తెచ్చుకుంది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు చైనాలో కేవలం 3 మిలియన్ డాలర్ల వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఓవర్సీస్ మార్కెట్లో 3 మిలియన్ డాలర్ మార్క్ అంటే చాలా ఎక్కువ. కానీ చైనా లాంటి భారీ మార్కెట్లో, దాదాపు 48వేల స్క్రీన్స్ పై విడుదలైన 2.O సినిమాకు 3 మిలియన్ డాలర్లు అంటే దాదాపు ఫ్లాప్ కింద లెక్క. ఇక ఈ సినిమా అక్కడ కోలుకోవడం దాదాపు కష్టమని తేలిపోయింది.

2.O మాత్రమే కాదు, గతంలో బాహుబలి, బాహుబలి-2 సినిమాలకు కూడా చైనా మార్కెట్లో ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా హిట్ అయిన ఈ సినిమాను చైనీయులు పట్టించుకోలేదు. బాహుబలి సినిమాకు చైనాలో పోస్టర్ల ఖర్చు కూడా రాలేదని రాజమౌళి స్వయంగా అంగీకరించాడు. ఇవి మాత్రమే కాదు, సల్మాన్ నటించిన చాలా సినిమాలు చైనాలో ఫ్లాప్స్ అయ్యాయి.

మరోవైపు అమీర్ నటించిన దంగల్ సినిమా చైనాలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీనికి కారణం సినిమాలో కంటెంట్. కేవలం సినిమాలో కథ నచ్చడంతో దంగల్ కు చైనీయులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా భారత్ లో బాహుబలి-2 వసూళ్లను క్రాస్ చేయలేకపోయింది. అంటే.. చైనా-ఇండియా మధ్య సినిమాల విషయంలో ప్రేక్షకుల టేస్ట్ ను అర్థం చేసుకోవచ్చు.

కేవలం దంగల్ మాత్రమే కాదు… సీక్రెట్ సూపర్ స్టార్, హిందీ మీడియం, అంధాదున్ లాంటి ఎన్నో సినిమాలు చైనాలో సూపర్ హిట్ అయ్యాయి. ఇవన్నీ కంటెంట్ ఉన్న సినిమాలు. దీన్ని బట్టి చైనా-భారత్ మధ్య మూవీ టేస్ట్ ను అంచనా వేసుకోవచ్చు. సో.. 2.O అక్కడ ఆడకపోవడం ఇండియన్ ట్రేడ్ ను పెద్దగా ఆశ్చర్యానికి గురిచేయలేదు. భవిష్యత్ లో సాహో సినిమా కూడా చైనాలో ఆడుతుందన్న గ్యారెంటీ లేదు.