Telugu Global
NEWS

ఇంకా గాడిన పడని ఇసుక విధానం

ఏపీలో ఇంకా ఇసుక సమస్య వెంటాడుతూనే ఉంది. కొత్త పాలసీని తీసుకొచ్చినప్పటికీ అందులోని కొన్ని లోపాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. అనుకున్నంత మేర స్టాక్ యార్డుల్లో ఇసుక లేకపోవడం కొన్ని చోట్ల కనిపిస్తోంది. కట్టడం వివరాలను ఎంటర్ చేసిన తర్వాత అటోమెటిక్ విధానం తక్కువ ఇసుకను మాత్రమే అంచనా వేస్తోంది. కొన్ని చోట్ల ఇసుక తరలింపుకు వాహనాల కొరత వెంటాడుతోంది. దాంతో ప్రజలే వాహనం తీసుకుని స్టాక్‌ పాయింట్ల వద్దకు వెళ్తున్నారు. జీపీఎస్ అమర్చిన వాహనాలు ఇంకా […]

ఇంకా గాడిన పడని ఇసుక విధానం
X

ఏపీలో ఇంకా ఇసుక సమస్య వెంటాడుతూనే ఉంది. కొత్త పాలసీని తీసుకొచ్చినప్పటికీ అందులోని కొన్ని లోపాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. అనుకున్నంత మేర స్టాక్ యార్డుల్లో ఇసుక లేకపోవడం కొన్ని చోట్ల కనిపిస్తోంది. కట్టడం వివరాలను ఎంటర్ చేసిన తర్వాత అటోమెటిక్ విధానం తక్కువ ఇసుకను మాత్రమే అంచనా వేస్తోంది. కొన్ని చోట్ల ఇసుక తరలింపుకు వాహనాల కొరత వెంటాడుతోంది. దాంతో ప్రజలే వాహనం తీసుకుని స్టాక్‌ పాయింట్ల వద్దకు వెళ్తున్నారు. జీపీఎస్ అమర్చిన వాహనాలు ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు.

ఇప్పటికీ సామాన్యుల్లో ఇసుక ఎలా బుక్ చేయాలో అవగాహన లేకపోవడం కూడా ఇబ్బందిగా మారింది. విధానం బాగానే ఉన్నా దాన్ని అమలు చేసేందుకు అవసరమైన వ్యవస్థ అందుబాటులోకి ఇంకా రాలేదన్న విమర్శలు వస్తున్నాయి. దాంతో ఇసుక కోసం కొందరు వినియోగదారులు రోజంతా వెచ్చించాల్సి వస్తోంది.

దీనికి తోడు ఇసుక బుకింగ్ మధ్యాహ్నం 12 నుంచి మాత్రమే అనుమతి ఇస్తున్నారు. పైగా సెలవు దినాల్లో ఇసుక బుకింగ్‌ ఉండదని వెబ్‌సైట్‌ చెబుతోంది. అది కూడా వినియోగదారుడికి ఇబ్బందిగా మారింది. కాల్‌సెంటర్‌కు కూడా ఆదివారం సెలవు ప్రకటించారు.

ఈ తలనొప్పి ఎందుకని భావిస్తున్న కొందరు మళ్లీ బ్లాక్ మార్కెట్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇసుక అక్రమ రవాణా చేసే వారు నేరుగా ఇంటి వద్దకు ఇసుక తెచ్చి ఇస్తుండడంతో కొంచెం డబ్బులు ఎక్కువగా చెల్లించేందుకు కూడా వినియోగదారులు వెనుకాడడం లేదు.

ఈ పరిస్థితిపై స్పందించిన ఏపీ గనుల శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ వి. కోటేశ్వరరావు ఈ విధానం ప్రారంభించి కొద్దిరోజులే అయింది కాబట్టి కొన్ని సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. జిల్లాల నుంచి అభిప్రాయలు, ఇబ్బందులు తెలుసుకుంటున్నామని… వాటిని త్వరలోనే అధిగమిస్తామని చెప్పారు.

ఇసుక అక్రమ రవాణా అంశం కూడా తమ దృష్టికి వచ్చిందని… కొత్త పాలసీ అమలులోని లోపాలను పూర్తిగా అధిగమించి పరిస్థితిని గాడిలో పెట్టిన తర్వాత ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై దృష్టి పెడతామని వెల్లడించారు.

ఇసుక ఇబ్బందిని అధిగమించాలన్నా… బ్లాక్ మార్కెట్ మళ్లీ పేట్రేగకుండా ఉండాలన్నా వీలైనన్ని ఎక్కువ స్టాక్ యార్డులను ఏర్పాటు చేసి కావాల్సినంత ఇసుకను అందుబాటులో ఉంచడం, మరింత సులువుగా వినియోగదారుడికి ఇసుక చేరేలా చూడడమే మార్గమన్న అభిప్రాయాన్ని వినియోగదారులు వ్యక్తం చేస్తున్నారు.

First Published:  9 Sep 2019 12:09 AM GMT
Next Story