ఇంగ్లండ్ గడ్డపై 18 ఏళ్ల తర్వాత యాషెస్ నెగ్గిన ఆసీస్

  • మాంచెస్టర్ టెస్టులో 185 పరుగులతో ఇంగ్లండ్ చిత్తు
  • ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా స్టీవ్ స్మిత్

ఇంగ్లండ్ గడ్డపై ఆస్ట్ర్రేలియా 18 ఏళ్ల విరామం తర్వాత యాషెస్ సిరీస్ సొంతం చేసుకొంది. ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా జరుగుతున్న పాంచ్ పటాకా యాషెస్ సిరీస్ లోని మొదటి నాలుగు టెస్టులు ముగిసే సమయానికి ఆస్ట్ర్రేలియా 2-1తో తిరుగులేని ఆధిక్యత సంపాదించింది.

మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా ముగిసిన నాలుగోటెస్టులో ఆస్ట్ర్రేలియా 185 పరుగులతో ఆతిథ్య ఇంగ్లండ్ ను చిత్తు చేసి 2-1తో సిరీస్ ఖాయం చేసుకొంది.

స్మిత్ సూపర్ షో….

కంగారూ స్టార్ బ్యాట్స్‌ మన్, టెస్ట్ క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు స్టీవ్ స్మిత్ తొలి ఇన్నింగ్స్ లో 211, రెండో ఇన్నింగ్స్ లో 82 పరుగుల స్కోర్లు సాధించడం ద్వారా మరోసారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

అంతకు ముందు 383 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన ఇంగ్లండ్ 197 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ డెన్లో 53 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

కంగారూ బౌలర్లలో కమిన్స్ 4, హేజిల్ వుడ్, లయన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

18 ఏళ్ల తర్వాత నెగ్గిన కంగారూలు..

ఇంగ్లండ్ ను ఇంగ్లండ్ గడ్డపై ఓడించడం ద్వారా యాషెస్ సిరీస్ నెగ్గాలన్న ఆస్ట్ర్రేలియా కల 18 సంవత్సరాల విరామం తర్వాత నెరవేరింది.

2001 సిరీస్ లో చివరిసారిగా ఇంగ్లండ్ గడ్డపై ఆస్ట్ర్రేలియా 4-1తో సిరీస్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత మరో విజయం కోసం 18 సంవత్సరాలపాటు వేచిచూడాల్సి వచ్చింది.

2001 తర్వాత ఇంగ్లండ్ తొలి ఓటమి

మాంచెస్టర్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్ ల్లో ఇంగ్లండ్ కు గత 18 సంవత్సరాలలో ఇదే తొలిపరాజయం కావడం విశేషం.

2001లో చివరిసారిగా పాక్ చేతిలో ఓటమి పొందిన ఇంగ్లండ్ … ఆ తర్వాత ఆడిన మొత్తం 11 టెస్టుల్లో 9 విజయాలు 2 డ్రాల రికార్డుతో నిలిచింది. 

సిరీస్ లోని ఆఖరి టెస్ట్ లండన్ లోని ఓవల్ స్టేడియం వేదికగా ఈనెల 12న ప్రారంభమవుతుంది.