మంగాయమ్మ గర్భధారణ తర్వాత ఇతర వృద్ధుల్లోనూ విపరీత ధోరణులు

ఇటీవలే తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నెలవర్తిపాడుకు చెందిన 74 ఏళ్ల మంగాయమ్మ ఐవీఎఫ్ పద్దతిలో ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అందరూ ఇదేం విపరీతం అని ఆందోళన వ్యక్తం చేసినా… మీడియా మాత్రం మంగాయమ్మ గర్భధారణపై గంటల తరబడి కథనాలు ప్రసారం చేసి సంబరాలు చేసుకుంది.

74 ఏళ్లలో ఇద్దరు పిల్లలకు జన్మనిస్తే వారి ఆలనా పాలనా ఎవరు చూస్తారని సగటు మనిషి కూడా ప్రశ్నించాడు. ఎవరో సూటిపోటి మాటలు అన్నారని… 74 ఏళ్లలో గర్భధారణ ఏంటి అని మహిళలు కూడా ఆందోళన చెందారు. కానీ మీడియా సంబరాల మాటున ఆ మాటలకు పెద్దగా విలువ రాలేదు. ఎవరి ఇష్టం వారిది అంటూ సంఘం గురించి కాకుండా వ్యక్తిగత ధోరణిలో సమర్ధించిన వారూ ఉన్నారు. పండు ముసలి వాళ్లతోనూ కాయలు కాయిస్తాం అని చాటుకుని వ్యాపారం చేసుకునేందుకు ఆస్పత్రులు కూడా ఇలాంటి విపరీత ధోరణులను ప్రేరేపిస్తున్నాయన్న ఆరోపణలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో వైద్య వర్గాలు ఈ అంశంపై స్పందించాయి. ఈ ఘటనపై ఇండియన్ సొసైటీ ఆఫ్ రీ ప్రొడక్షన్, ఇండయిన్ ఫెర్టిలిటీ సొసైటీ, అకాడెమి ఆఫ్ క్లినికల్ ఎంబ్రాలజిస్ట్స్ సంఘాలు సమాజానికి క్షమాపణ తెలిపాయి. ఇది పూర్తి అనైతిక చర్యగానే తాము భావిస్తున్నామని…అసిస్టెడ్ రీ ప్రొడక్టివ్ టెక్నాలజీ నిబంధనలను పూర్తిగా దుర్వినియోగ పరిచారని సంఘాలు అభిప్రాయపడ్డాయి. ఇలాంటి పనులు భవిష్యత్తులో ఎవరూ చేయకూడదని… దీని వల్ల వచ్చే అనర్ధాలు చాలా ఉంటాయని… ప్రస్తుతం మంగాయమ్మ విషయంలో జరిగిన దానికి తాము క్షమాపణ చెబుతున్నామని సంఘాలు వెల్లడించాయి.

ఎట్టి పరిస్థితుల్లోనూ 50 ఏళ్లు దాటిన మహిళలు గర్భధారణ పొందడం మంచిది కాదని వైద్యులు సూచించారు. దీని వల్ల ఆ మహిళకే కాకుండా పుట్టే పిల్లలకు చాలా ఇబ్బందులు వస్తాయని వివరించారు. మంగాయమ్మ ఉదంతం సమాజంపై తీవ్ర ప్రభావమే చూపినట్టుగా ఉంది.

ఈ ఉదంతాన్ని టీవీల్లో చూసిన తర్వాత చాలా మంది వృద్ధులు తమకు ఫోన్లు చేసి .. తాము కూడా మంగాయమ్మలాగా పిల్లలను కనే వీలుంటుందా అని ఆరా తీస్తున్నారని విజయవాడకు చెందిన వైద్యురాలు వై.స్వప్న ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఏమాత్రం సమాజానికి మంచిది కాదన్నారు.

ఇలాంటి కృత్తిమ గర్భధారణపై విదేశాల్లో చట్టాలు కఠినంగా ఉంటాయని.. ఇక్కడ ఆ పరిస్థితి లేకపోవడం వల్లే ఇబ్బందులు వస్తున్నాయని సదరు డాక్టర్ అభిప్రాయపడ్డారు. 74 ఏళ్లలో మంగాయమ్మకు కృత్తిమ గర్బధారణ చేసిన గుంటూరులోని అహల్య ఆస్పత్రిపైనా, అక్కడి వైద్యులపైనా ఇండియన్ ఫెర్టిలిటీ సొసైటీ తీవ్రంగా స్పందించింది. ఆస్పత్రి పూర్తిగా అనైతిక చర్యకు పాల్పడిందని ఒక ప్రకటనలో అభిప్రాయపడింది.

సమాజం గురించి ఆలోచించకుండా కేవలం సంచలనం కోసం ఇలాంటి విపరీత ధోరణులకు తెగబడే అహల్య ఆస్పత్రి లాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.