కేసీఆర్ మాట తప్పాడు…. నాయిని నరసింహారెడ్డి సంచలన వ్యాఖ్యలు

గులాబీ దళంలో అసంతృప్తి సెగలు మొదలయ్యాయి. ఒక్కో గొంతు మెల్లగా మెల్లగా వినిపిస్తోంది. తమ అసంతృప్తిని బయటపెడుతున్నారు. మొన్న ఈటెల… నిన్న రసమయి బాలకిషన్‌ స్వరం వినిపిస్తే… తాజాగా మాజీ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి గళం విప్పారు. ఏకంగా కేసీఆర్‌ పైనే గురిపెట్టి బాణాలు విసిరారు.

సీఎం కేసీఆర్‌ మాట తప్పారని నాయిని నరసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ముషీరాబాద్‌ టికెట్‌ అడిగితే.. ముఠా గోపాల్‌ను గెలిపించుకురా మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారని.. కానీ ఆతర్వాత పట్టించుకోలేదని అన్నారాయన. తన అల్లుడికైనా టికెట్‌ ఇవ్వమని అడిగితే ఈ కండీషన్‌ పెట్టారని… కానీ తీరా ఎన్నికల అయిన తర్వాత పట్టించుకోవడం మానేశారని చెప్పారు. తనకు ఏ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి వద్దని అన్నారు నాయిని.

ఈరోజు నాయిని మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌ చేశారు. హోం మంత్రిగా పనిచేసిన తనకు కార్పొరేషన్‌ పదవి ఇస్తారా? అని ప్రశ్నించారు. గులాబీ జెండాకు తాను కూడా ఓనరేనని చెప్పుకొచ్చారు. కిరాయికి వచ్చినవాళ్లు ఎప్పుడు దిగిపోతారో తెలియదని చెప్పారు.

మొత్తానికి గులాబీదళంలో అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. ఒకరి తర్వాత ఒకరు బయటకు వస్తున్నారు. మరీ ఈ గళాలకు కేసీఆర్‌ ఎలా అడ్డుకట్ట వేస్తారో చూడాలి. నామినేటేడ్‌ పదవుల భర్తీ తర్వాత మరింత మంది నేతలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం నడుస్తోంది.