యూఎస్ ఓపెన్ చాంప్ రాఫెల్ నడాల్

  • తుదివరకూ పోరాడి ఓడిన మెద్వదేవ్ 
  • నడాల్ ఖాతాలో 19వ గ్రాండ్ స్లామ్ టైటిల్

స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్..యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను నాలుగోసారి గెలుచుకొన్నాడు. తన గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సంఖ్యను 19కి పెంచుకొన్నాడు.

న్యూయార్క్ లోని ఆర్థర్ యాష్ స్టేడియం వేదికగా 4 గంటల 50 నిముషాలపాటు సాగిన హోరాహోరీ ఫైనల్లో 2వ సీడ్ నడాల్..రష్యాకు చెందిన 5వ సీడ్ ఆటగాడు డేనిల్లీ మెద్వదేవ్ ను అధిగమించాడు.

నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఈ టైటిల్ పోరులో నడాల్ 7-5, 6-3, 5-7, 4-6, 6-4తో విజేతగా నిలిచాడు. 33 ఏళ్ల నడాల్ కు 23 ఏళ్ల మెద్వదేవ్ అడుగడుగున గట్టి పోటీ ఇచ్చి వారేవ్వా అనిపించుకొన్నాడు.

నడాల్ ఖాతాలో 19వ టైటిల్…

క్లే కోర్టు స్పెషలిస్ట్ రాఫెల్ నడాల్…యూఎస్ టైటిల్ నెగ్గడం ఇది నాలుగోసారి. 12 ఫ్రెంచ్ ఓపెన్, 2 వింబుల్డన్, ఓ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన నడాల్..మొత్తం 19 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో ..ఫెదరర్ తర్వాతి స్థానంలో నిలిచాడు. మరొక్క టైటిల్ నెగ్గితే ఫెదరర్ 20 టైటిల్స్ రికార్డును నడాల్ సమం చేయగలుగుతాడు.

ఈ విజయంతో ట్రోఫీతో పాటు 27 కోట్ల 40 లక్షల రూపాయల ప్రైజ్ మనీ సైతం నడాల్ సొంతమయ్యింది. రన్నరప్ మెద్వదేవ్ రన్నరప్ ట్రోఫీతో పాటు 12 కోట్ల 20 లక్షల రూపాయల ప్రైజ్ మనీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.