Telugu Global
International

వెయ్యేళ్ల క్రితం నాటి బౌద్ధ సన్యాసి మమ్మీ

సాధారణంగా మమ్మీ అనగానే ఈజిప్ట్ గుర్తుకొస్తుంది. కానీ మమ్మిఫికేషన్ అనేది ఈజిప్ట్ కే పరిమితం కాలేదు. ప్రాచీన చైనాలో కూడా ఓ విధమైన మమ్మిఫికేషన్ ఉన్నదని ఈ ఉదంతం నిరూపిస్తున్నది. చైనాకు చెందిన, పద్మాసనంలో కూర్చున్న ఒక బౌద్ధ సన్యాసి విగ్రహాన్ని స్కానింగ్ చేశారు శాస్త్రవేత్తలు. ఆ విగ్రహంలో ఒక అస్థిపంజరం ఉన్నట్లు తేలింది. ఇది వెయ్యేళ్ల క్రితం జీవించి ఉన్న ఓ బౌద్ధ సన్యాసి అస్థిపంజరంగా వీరు భావిస్తున్నారు. ఆధునిక శాస్త్ర విజ్ఞానం ప్రాచీన సంస్కృతి […]

వెయ్యేళ్ల క్రితం నాటి బౌద్ధ సన్యాసి మమ్మీ
X

సాధారణంగా మమ్మీ అనగానే ఈజిప్ట్ గుర్తుకొస్తుంది. కానీ మమ్మిఫికేషన్ అనేది ఈజిప్ట్ కే పరిమితం కాలేదు. ప్రాచీన చైనాలో కూడా ఓ విధమైన మమ్మిఫికేషన్ ఉన్నదని ఈ ఉదంతం నిరూపిస్తున్నది.

చైనాకు చెందిన, పద్మాసనంలో కూర్చున్న ఒక బౌద్ధ సన్యాసి విగ్రహాన్ని స్కానింగ్ చేశారు శాస్త్రవేత్తలు. ఆ విగ్రహంలో ఒక అస్థిపంజరం ఉన్నట్లు తేలింది. ఇది వెయ్యేళ్ల క్రితం జీవించి ఉన్న ఓ బౌద్ధ సన్యాసి అస్థిపంజరంగా వీరు భావిస్తున్నారు. ఆధునిక శాస్త్ర విజ్ఞానం ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకోవడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఈ ఆవిష్కరణ మరోసారి రుజువు చేస్తున్నది.

ఈ ప్రతిమ ప్రసిద్ధిగాంచిన ఝాంగ్ దిగా గుర్తిస్తున్నారు. 1990 లోనే ఈ విగ్రహానికి మరమ్మతులు చేసే సమయంలో దీని ప్రత్యేకతను గుర్తించారు. పూర్వం చైనాలో బౌద్ధ సన్యాసులు తమంతట తాము మమ్మీ లుగా మారిపోయే ఆచారాన్ని పాటించే వారు. ఇది చాలా కష్టం తోనూ, దీక్షతోను చేసే ప్రక్రియ.

దీని ప్రకారం ఎవరైతే మమ్మీ గా మారాలి అనుకుంటున్నారో, వారు వెయ్యి రోజుల పాటు కేవలం నట్స్, సీడ్స్ వంటివాటితోనే జీవించేవారు. ఇలా చేయడం వల్ల శరీరంలోని కొవ్వు మొత్తం కరిగిపోయేది. ఆ తర్వాత మరో వెయ్యి రోజుల పాటు ఓ వృక్షం వేళ్లు, బెరడు ను మాత్రమే ఆహారంగా తీసుకునేవారు. ఇలా చేసినప్పుడు వాంతులు అయ్యేవి. దీంతో శరీరం లోపల ఉండే ద్రవం మొత్తం బయటకు వచ్చేది. మరణించిన తర్వాత శరీరంలో ద్రవం లేదా తేమ ఉంటే శరీరం త్వరగా నశించిపోతుంది.

అందుకనే నాటి బౌద్ధ సన్యాసులు బ్రతికుండగానే శరీరంలో ఉన్నటువంటి తేమను హరించి వేసేలా కఠినమైన ఆహార నియమాలు పాటించే వారు.

ఈ విధంగా రెండు వేల రోజులు గడిచిన తర్వాత ఆ బౌద్ధ సన్యాసి ఒక చిన్న సమాధిలోకి వెళ్ళి పోతాడు. పైన రాళ్లు కప్పి ఉన్న ఆ సమాధి కి గాలి సరఫరా కోసం ఒక చిన్న ట్యూబ్ ని బయట నుంచి లోపలికి వదిలేవారు. అట్లానే ఒక గంటని కూడా దానితో పాటే వదిలేవారు. సమాధిలో ఉన్న బౌద్ధ సన్యాసి పద్మాసనంలో కూర్చుని ధ్యానం చేస్తూ ఉండేవాడు.

ఇలా ధ్యానంలోనే అతడు తుది శ్వాస విడిచే వాడు. గాలి ట్యూబ్ తో పాటు వదిలిన గంట అతడు మరణించిన తర్వాత మోగటం ఆగిపోయేదని, దీంతో సన్యాసి మరణించాడని బయట ఉన్న బౌద్ధులు భావించేవారు.

ప్రస్తుతం ఈ విగ్రహ రూపం లో ఉన్న మమ్మీ హాలెండ్ లో ఉంది. ఇటలీ, జర్మని, హాలెండ్ సైంటిస్ట్ లు దీనిని స్కాన్ చేసి పరిశోధనలు చేస్తున్నారు.

First Published:  9 Sep 2019 4:30 AM GMT
Next Story