సీమలో చైతన్యం… అందుకే పల్నాడులో బాబు అలజడి వ్యూహం

ఆంధ్రప్రదేశ్‌లో మూడు నెలలుగా రాజకీయ ప్రతీకార హత్యలు లేవు. గతంలో లాగా సామూహిక దాడులు లేవు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయన్న భావన కలిగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అధికార పార్టీ ఆరోపిస్తోంది.

రాష్ట్రం ప్రశాంతంగా ఉండడం చంద్రబాబుకు ఇష్టం లేదని అందుకే పల్నాడు వేదికగా అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని హోంమంత్రి కూడా ఆరోపించారు. అయితే పల్నాడుపైనే చంద్రబాబు ఫోకస్ పెట్టడానికి ప్రత్యేక కారణాలున్నాయని చెబుతున్నారు.

గతంలో శాంతిభద్రతల అంశంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని… చాటేందుకు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు రాయలసీమ ప్రాంతాన్ని ఎంచుకునే వారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా చంద్రబాబుకు బాగా ఉపయోగపడేది.

చంద్రబాబు 9ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వందల మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా అనంతపురంలో హత్యలకు గురయ్యారు. కానీ ఎఫ్‌ఐఆర్‌లు కూడా నమోదు అయ్యేవి కాదు. దాంతో అవకాశం కోసం కాచుకున్న కాంగ్రెస్ వారు… తమ పార్టీ అధికారంలోకి రాగానే టీడీపీ నేతలపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నించే వారు.

ఆ కోవలోనే అనంతపురం జిల్లాలో పలువురు టీడీపీ నేతలు హత్యలకు గురయ్యారు. ఆ తర్వాత చాలా స్ట్రిక్ట్ గా ఉండే పోలీసు ఉన్నతాధికారులను నియమించి అనంతపురం జిల్లాలోనూ ఫ్యాక్షన్‌ను కంట్రోల్ చేశారు వైఎస్.

తిరిగి ఐదేళ్ల చంద్రబాబు పాలనలో పలువురు వైసీపీ నేతలు హత్యలకు గురయ్యారు. ఇప్పుడు జగన్‌ ముఖ్యమంత్రి అవగానే తిరిగి వైసీపీ నుంచి ప్రతీకార హత్యలుంటాయని భావించారు. కానీ ఎక్కడా ఒక్క టీడీపీ నేత హత్య కూడా జరగలేదు. ఇదే టీడీపీకి ఇబ్బందిగా మారింది.

ఇలా అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ పూర్తిగా మటుమాయం అవడానికి కారణం కొత్త ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన ఆదేశాలతో పాటు… ఇక్కడి ప్రజల్లో పెరిగిన చైతన్యం కూడా ప్రధాన కారణం.

ప్రతీకార రాజకీయాలకు ఎక్కడో ఒక చోట ఫుల్‌ స్టాప్ పెట్టకపోతే అవి కొనసాగుతూనే ఉంటాయన్న భావన సీమ నేతల్లో, పార్టీ శ్రేణుల్లో పెరిగింది. ఇందుకు జగన్ మోహన్ రెడ్డి కూడా పోలీసులకు పూర్తి స్వేచ్చ ఇచ్చి.. సొంత పార్టీ వారికి కూడా ప్రతీకార చర్యలకు దిగవద్దని సూచించడంతో…. సీమ… ముఖ్యంగా అనంతపురం జిల్లా ఎన్నడూ లేనంత ప్రశాంతంగా ఉంది.

ఈ నేపథ్యంలో శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం విఫలమైందని చాటేందుకు రాయలసీమ ఈసారి చంద్రబాబుకు అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పల్నాడు ప్రాంతాన్ని ఎంచుకున్నట్టు చెబుతున్నారు. అక్కడ తన వర్గం వారు కూడా బాగానే ఉండడంతో వారి ద్వారా గోరంత అంశాన్ని కొండంత చేసి చూపే వ్యవహారాన్ని చంద్రబాబు విజయవంతంగా నడుపుతున్నారని భావిస్తున్నారు.

చిన్నచిన్న గొడవలను కూడా భూతద్దంలో చూపించేందుకు అక్కడి టీడీపీ నేతలు కూడా చంద్రబాబు మనసెరిగి పని చేస్తున్నారు. ఇలా అనుకూల పరిస్థితులు ఉండడం వల్లే చంద్రబాబు తన అలజడి వ్యూహాన్ని సీమ నుంచి పల్నాడుకు మార్చినట్టు భావిస్తున్నారు.