గబ్బర్ సింగ్ ను ఫాలో అయిన వాల్మీకి

గబ్బర్ సింగ్ సినిమాలో అంత్యాక్షరి ఎపిసోడ్ అందరికీ గుర్తే. పవన్ నటించిన ఆ సినిమా ఎంత హిట్ అయిందో, అందులో అంత్యాక్షరి ఎపిసోడ్ కూడా అంతే హిట్ అయింది. అందుకే హరీష్ మరోసారి ఆ ఫార్ములా ఫాలో అయ్యాడు. వాల్మీకి కోసం మరో హిలేరియస్ ఎపిసోడ్ రెడీ చేశాడు. అదే పేరడీ ఎపిసోడ్.

తెలుగు సినిమాల్లో పేరడీ కొత్తకాదు. చాలామంది కమెడియన్స్, చాలామంది హీరోల్ని అనుకరిస్తూ సినిమాలు చేశారు. వీటిలో ది బెస్ట్ దూకుడులో ఎమ్మెస్ నారాయణ కామెడీ. హీరోల్ని పేరడీ చేస్తూ.. ఏకథాటిగా 3 నిమిషాల పాటు ఎమ్మెస్ నారాయణ చేసిన ఆ ఎపిసోడ్ హైలెట్ గా నిలిచింది. ఇప్పుడు దాదాపు అలాంటిదే వాల్మీకిలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

వాల్మీకి సినిమా కోసం హరీష్ శంకర్ పేరడీ టచ్ తో ఓ హిలేరియస్ ఎపిసోడ్ రాసుకున్నాడట. దానికి సంబంధించి నిన్న రిలీజైన ట్రయిలర్ లో మచ్చుకు ఓ సీన్ కూడా బయటపెట్టాడు. సినిమాకు అది మరో ఎట్రాక్షన్ అంటున్నాడు హరీష్.

వాల్మీకి సినిమాలో వెల్లువొచ్చి గోదారమ్మ అంటూ సాగే శోభన్ బాబు సాంగ్ ను రీమిక్స్ చేశారు. దాంతో పాటు ఈ పేరడీ ఎపిసోడ్ కూడా మెయిన్ ఎట్రాక్షన్స్ గా చెబుతున్నారు. మరో 10 రోజుల్లో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. వచ్చే వారం సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేయబోతున్నారు.