గులాబీలో అస‌మ్మ‌తి రాగం… అజ్ఞాతంలోకి జోగు రామ‌న్న !

గులాబీలో అస‌మ్మ‌తి రాగం బ‌య‌ట‌ప‌డుతోంది. మంత్ర‌వ‌ర్గంలో చోటుద‌క్క‌ని నేత‌లు ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ఇప్ప‌టికే మాజీ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి నోరు విప్పారు. మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని చెప్పి సీఎం కేసీఆర్ మోసం చేశార‌ని వాపోయారు. త‌న‌కు ఇస్తాన‌న్న ఆర్టీసీ ఛైర్మ‌న్ ప‌ద‌వి కూడా వ‌ద్ద‌ని తెగేసి చెప్పారు.

ఆదిలాబాద్ జిల్లాలో కూడా మంత్ర‌వ‌ర్గ విస్త‌ర‌ణ మంట‌లు వ్యాపించాయి. మాజీ మంత్రి జోగు రామ‌న్న అల‌క‌బూనారు. సోమ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లారు. గ‌న్‌మెన్లు, డ్రైవ‌ర్ల‌ను వెన‌క్కి పంపి అండ‌ర్‌గ్రౌండ్‌కి వెళ్లిపోయారు. ఫోన్లు స్విచాప్ రావ‌డంతో కుటుంబ‌స‌భ్యులను ఆరా తీస్తున్నారు. మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్క‌క‌పోవ‌డంతో మన‌స్తాపం చెంది అజ్ఞాతంలోకి వెళ్లార‌ని స‌న్నిహితులు చెబుతున్నారు.

ఆదిలాబాద్‌లోని జోగు రామ‌న్న నివాసం ద‌గ్గ‌ర ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. ఆయ‌నకు మ‌ద్ద‌తుగా అనుచ‌రులు నిర‌స‌న చేప‌ట్టారు. కిరోసిన్ పోసుకోవ‌డానికి ఓ కార్య‌క‌ర్త ప్ర‌య‌త్నం చేశారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు.

జోగురామ‌న్న కేసీఆర్ గ‌త కేబినెట్‌లో ప‌నిచేశారు. బీసీ సంక్షేమం, అట‌వీ శాఖ చూశారు. మున్నూరు కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన త‌న‌కు మ‌ళ్లీ మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్కుతుంద‌ని ఆయ‌న ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే ఇదే సామాజిక వ‌ర్గం నుంచి గంగుల క‌మ‌లాక‌ర్‌కు చాన్స్ ఇచ్చారు. దీంతో మ‌న‌స్తాపం చెందిన ఆయ‌న అజ్ఞాతంలోకి వెళ్లారు.

ఉమ్మ‌డి కరీంన‌గ‌ర్ జిల్లాకు నాలుగు మంత్రి ప‌ద‌వులు ఎలా ఇస్తార‌నేది గులాబీ ద‌ళంలో విన్పిస్తున్న ప్ర‌శ్న‌. మున్నూరు కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన బీజేపీ ఎంపీ బండి సంజ‌య్‌ను ఎదుర్కొనేందుకు క‌మ‌లాక‌ర్‌కు ప‌ద‌వి ఇచ్చార‌ని… అయితే ఆదిలాబాద్‌లో కూడా బీజేపీ బెడ‌ద ఉంద‌ని…ఇక్క‌డ ఎందుకు ఇవ్వ‌లేద‌నేది జోగురామ‌న్న అనుచ‌రుల ప్ర‌శ్న‌.

మొత్తానికి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌, నామినేటేడ్ ప‌ద‌వుల భ‌ర్తీతో గులాబీలో కుంప‌టి రాజేసే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి. రాబోయే మున్సిప‌ల్ ఎన్నిక‌ల నాటికి ఇవి మ‌రింత ముదిరే అవ‌కాశాలు ఉన్నాయి .