నల్లమల సర్వేకు వచ్చిన జీఎస్ఐ…. వెళ్లగొట్టిన ప్రజాసంఘాలు

తెలంగాణలోని నల్లమల ప్రాంతంలో యురేనియం నిక్షేపాల వెలికితీతకు సంబంధించి అన్ని రకాల అనుమతులను కేంద్రం జారీ చేసింది. ఇటీవల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ కూడా నల్లమల యురేనియం తవ్వకాలకు పచ్చ జెండా ఊపడంతో అక్కడ ప్రజా ఉద్యమం మొదలైంది.

యురేనియం తవ్వకాలకు మేం వ్యతిరేకం అంటూ నాగర్‌కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్, పనర మండలాలు, నల్లగొండ జిల్లా పరిధిలోని దేవరకొండ ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

సోమవారం రోజు యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా నల్లమల బంద్‌కు అఖిల పక్షం పిలుపునిచ్చింది. మన్ననూర్ వద్ద వందలాది మంది ప్రజలు శ్రీశైలం – హైదరాబాద్ జాతీయ రహదారిపై నిరసనకు దిగారు. దీంతో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. అదే సమయంలో ఆందోళనకు దిగిన ప్రజా సంఘ నాయకులను అరెస్టు చేసి ఈగలపెంట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

కాగా, ఒకవైపు నల్లమలలో నిరసనలు, ఆందోళనలు కొనసాగుతుండగానే.. ఇవాళ నల్లగొండ జిల్లా దేవరకొండలో కలకలం రేగింది. దేవరకొండ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల సర్వే కోసం వచ్చిన కేంద్ర ప్రభుత్వ జీఎస్ఐ సంస్థ ఉద్యోగులను ప్రజా సంఘాలు ఘెరావ్ చేశాయి. సోమవారం రాత్రి ఒక లాడ్జిలో దాదాపు 30 మంది సర్వేయర్లు ఉన్నారని తెలుసుకొని మంగళవారం ఉదయం ప్రజా సంఘాల నాయకులు అక్కడికి చేరుకున్నారు.

తెలంగాణ విద్యావంతుల వేదిక, దళిత యువజన జేఏసీ, పలు విద్యార్థి సంఘాల నేతలు, కార్యకర్తలు…. దేవరకొండలోని విష్ణుప్రియ లాడ్జి ముందుకు చేరుకున్నారు. నల్లమలలో ఎలాంటి సర్వేలు జరపవద్దంటూ నినాదాలు చేశారు. కాగా, వాళ్లు యురేనియం కోసం కాదని.. వేరే పని కోసం వచ్చారని పోలీసులు నచ్చచెప్పడానికి ప్రయత్నించినా వినకుండా నినాదాలు చేస్తుండటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఒక దశలో జియాలజిస్ట్‌లకు ఆందోళనకారులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మేం యురేనియం కోసం రాలేదని పత్రాలు చూపించినా.. ఆందోళనకారులు పట్టించుకోలేదు. చివరకు పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళనకారులను పక్కకు జరిపేశారు. కాగా, జియాలజిస్టులు మాత్రం ఎలాంటి సర్వే చేయకుండా హైదరాబాద్ వైపు వెళ్లిపోయారు.