ఏపీలో నో ఇంటర్వ్యూ…. డైరెక్ట్ జాబ్….

ఆంధ్రప్రదేశ్ లోని వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుడుతోంది. ఇంతవరకూ ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా సరై కొన్ని సంవత్సరాల పాటు వేచి చూడాల్సి వచ్చేది. ఒక్కోసారి కోర్టుల జోక్యం కూడా ఉండేది. దీంతో ఉద్యోగాల కోసం పరీక్షలు రాసినా…. సంవత్సరాల పాటు ఉద్యోగాలు వచ్చే వీలుండేది కాదు. దీంతో పరీక్ష నాటికి ఉన్న వయో పరిమితి అర్హతను అభ్యర్ధులు దాటిపోయే పరిస్థితి ఉండేది.

అయితే, ఇప్పుడు దానికి కాలం చెల్లిందంటోంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.

తాజాగా ఆంధ్రప్రదేశ్ లో గ్రామ సచివాలయాలతో పాటు ప్రభుత్వం నిర్వహించనున్న మద్యం దుకాణాల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి రాత పరీక్ష నిర్వహించింది ప్రభుత్వం. ఈ రాత పరీక్ష అనంతరం అభ్యర్ధుల మార్కుల ఆధారంగా వారి సర్టిఫికెట్లను పరిశీలించి నేరుగా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని పరీక్షల కమిటీ చైర్మన్ గోపాలక్రిష్ణ ద్వివేది తెలిపారు.

సచివాలయ, ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఉద్యోగాల కోసం పరీక్షలు రాసారని, ఇన్ని లక్షల మంది హాజయైనా ఎవరికి… ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలుగలేదని ఆయన తెలిపారు.

“గతంలో మాదిరిగా రాత పరీక్ష. అనంతరం ఇంటర్వ్యూలు అంటూ కాలయాపన చేయడం లేదు. జిల్లాల వారీగా, పోస్టుల వారీగా, కేటగిరీల ప్రకారం ర్యాంకులను ప్రకటిస్తాం. దాన్ని బట్టి నేరుగా ఉద్యోగాల్లో చేరడమే” అని గోపాల క్రిష్ణ ద్వివేదీ తెలిపారు.

రాత పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదని, డిగ్రీ విద్యార్థులు కూడా పోటీ పడే స్ధాయిలో ప్రశ్నాప్రతాలు రూపొందించామని ఆయన తెలిపారు. ప్రశ్నల్లో 25 శాతం సులభంగాను, 25 శాతం కఠినంగాను, మిగిలిన 50 శాతం సాధారణ ప్రశ్నలు ఇచ్చామని చెప్పారు.

“పరీక్షలను పూర్తి పారదర్శకంగా నిర్వహించాం. ఇందుకు తార్కాణం అభ్యర్ధులకు వారి ఓఎమ్మార్ షీట్లు వారి ఇంటికే ఇవ్వడం” అని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా ఇన్ని లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాలేదని, పైగా ఈ ఉద్యోగాలన్నీ ఖాళీలను భర్తీ చేసే ఉద్యోగాలు కావని ఆయన తెలిపారు. “ప్రభుత్వం కొత్త ఉద్యోగాలను సృష్టించింది. బహుశా ఇది ఏ రాష్ట్రంలోనూ సాధ్యపడ లేదు” అని ఆయన అన్నారు.