ఒలింపిక్స్ హాకీ అర్హత టోర్నీకి భారతజట్లు రెడీ

  • పురుషుల విభాగంలో రష్యాతో భారత తొలిసమరం
  • మహిళల విభాగంలో అమెరికాతో భారత్ ఢీ

టోక్యో వేదికగా వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్ హాకీ పురుషుల, మహిళల విభాగాలలో అర్హత కోసం జరిగే క్వాలిఫైయింగ్ టోర్నీల డ్రాలను అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రకటించింది.

హాకీ సమాఖ్య ప్రధానకార్యాలయం లాసానే వేదికగా డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు.

7 స్థానాల కోసం 14 జట్ల సమరం

ఒలింపిక్స్ హాకీ పురుషుల, మహిళల విభాగాల మెయిన్ డ్రాలో 12 జట్లు చొప్పున పోటీపడతాయి. మొత్తం ఐదు ఖండాలకు చెందిన విజేత జట్లు ఇప్పటికే నేరుగా ఒలింపిక్స్ మెయిన్ డ్రాకు అర్హత సాధించగా…మిగిలిన ఏడు బెర్త్ ల కోసం ర్యాంకుల ఆధారంగా 14 జట్లు ఢీ కొనబోతున్నాయి.

పురుషుల విభాగంలో ప్రపంచ 5వ ర్యాంకర్ భారత్ తన ప్రారంభమ్యాచ్ ను రష్యాతో ఆడనుంది. ఇటీవలే ముగిసిన ఓ టోర్నీలో రష్యాను 10-0 గోల్స్ తో చిత్తు చేసిన రికార్డు భారత్ కు ఉంది.

ఇక…మహిళల విభాగంలో 13వ ర్యాంక్ అమెరికాతో 9వ ర్యాంకర్ భారత్ పోటీపడనుంది. గతంలో అమెరికాతో ఆడిన మ్యాచ్ ను భారత మహిళాజట్టు 1-1తో డ్రాగా ముగించగలిగింది.

అక్టోబర్, నవంబర్ మాసాలలో జరిగే ఈ అర్హత పోటీలకు భువనేశ్వర్ లోని కళింగ ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.

పురుషుల విభాగంలో ఇతర తొలిరౌండ్ పోటీలలో జర్మనీతో ఆస్ట్ర్రియా, హాలెండ్ తో పాకిస్థాన్, స్పెయిన్ తో ఫ్రాన్స్, కెనడాతో ఐర్లాండ్, గ్రేట్ బ్రిటన్ తో మలేసియా, న్యూజిలాండ్ తో దక్షిణ కొరియా జట్లు తలపడనున్నాయి.

ఇవీ నేరుగా అర్హత సాధించిన జట్లు…

ఒలింపిక్స్ కు నేరుగా అర్హత సాధించినజట్లలో అర్జెంటీనా, సౌతాఫ్రికా, బెల్జియం, ఆస్ట్ర్రేలియా, జపాన్ ఉన్నాయి. మహిళల విభాగంలో జపాన్, అర్జెంటీనా, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్ ఉన్నాయి.

ఒలింపిక్స్ అర్హత టోర్నీ మ్యాచ్ లను అక్టోబర్ 25 నుంచి 27 వరకూ, తిరిగి నవంబర్ 1 నుంచి 3 వరకూ నిర్వహిస్తారు.