పబ్‌జీ ఉన్మాదం.. తండ్రి దారుణ హత్య

కీలకమైన టీనేజ్ వయసు ఇప్పుడు పబ్‌జీ పాలవుతోంది. టీనేజ్ పిల్లలు, యువకులు అనేక మంది ఇప్పుడు పబ్‌జీ పంజరంలో ఇరుక్కున్నారు. దాని నుంచి బయటకు రాలేనంతగా బానిసలైపోయారు. విలువైన మానవ పనిగంటలను పబ్‌జీ తినేస్తోంది.

దీన్ని నిషేధించాలని పలు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నా కేంద్రం నుంచి సరైన స్పందన లేకపోవడంతో పరిస్థితి నానాటికి దిగజారిపోతోంది. యువకులు చేయాల్సిన పని చేయడం మానేసి పబ్‌జీలో పడిపోతున్నారు.

దీని ప్రభావం యువతను మానసికంగానూ కృంగదీస్తోంది. పలువురు ఉన్మాదులుగా మారిపోతున్నారు. కర్నాటకలో ఒక యువకుడు పబ్‌జీకి బానిసైపోయి చివరకు తండ్రినే ముక్కముక్కలుగా నరికి చంపేశాడు.

బెళగావి తాలుకాలోని కాకతీ కాలనీలో ఉంటున్న శంకరప్ప దంపతుల కుమారుడు రఘవీర్‌ ఐటీఐ మెనానికల్ రెండో ఏడాది చదువుతున్నాడు. ఇటీవల పబ్‌జీకి బానిసయ్యాడు. చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. కొద్దిరోజులుగా అర్థరాత్రి బయటకు వచ్చి ఇతరుల ఇంటికి వెళ్ళి తలుపులు, కిటికీలు కొడుతూ తనకు రక్తం కావాలని గట్టిగా అరుస్తూ గొడవ చేస్తున్నాడని స్థానికులు పోలీసులకి తెలిపారు. వారి ఫిర్యాదుతో ఆదివారం తల్లిదండ్రులతో పాటు అతన్ని పోలీసులు పిలిపించి హెచ్చరించారు.

గత రాత్రి కూడా రఘువీర్ అర్థరాత్రి అయినా పబ్‌జీ ఆడుతూ చేతికి గాయం చేసుకున్నాడు. దాన్ని చూసిన తల్లి కట్టుకట్టేందుకు ప్రయత్నించగా ఆమెపై దాడికి ప్రయత్నించాడు. ఇంతలో శంకరప్ప వచ్చి బలవంతంగా గాయానికి కట్టుకట్టే ప్రయత్నం చేయగా రఘువీర్ తన తల్లిని ఒక గదిలోకి నెట్టేసి అనంతరం కత్తిపీటతో తండ్రిని ముక్కలుముక్కలుగా నరికేశాడు. దాంతో శంకరప్ప అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ దాడిలో శంకరప్ప తల భాగం వేరుపడింది.

విషయం తెలుసుకున్న పోలీసులు రఘువీర్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా వారిపైనా కత్తిపీటతో దాడికి ప్రయత్నించాడు. అరగంట పాటు శ్రమించిన పోలీసులు చివరకు బెడ్ షీట్లు అతడిపైకి వేసి అదిమిపట్టి అదుపులోకి తీసుకున్నారు. పబ్‌జీకి అలవాటు పడినప్పటి నుంచే తమ కుమారుడు ఇలా తయారయ్యాడని తల్లి చెబుతోంది.