టీడీపీకి అసత్య ప్రచారం తప్ప మరో దారి లేదు….

చిన్నచిన్న అంశాలను కూడా బూతద్దంలో చూపించి ప్రచారం చేయడం…. పెయిడ్ ఆర్టిస్టులకు రైతుల వేషం వేయించి ప్రభుత్వాన్ని తిట్టించడం…. ఒకటి రెండు చోట్ల రేషన్ బియ్యం గడ్డ కడితే ఆ విషయాన్ని కొన్ని పత్రికలు ఏకంగా పతాక శీర్షికల్లో ప్రచురించడం…. తిరుమలలో ఏసు మందిరం అంటూ విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రచారం చేయడం… చిన్నచిన్న ఘటనల ఆధారంగా మొత్తం శాంతిభద్రలు అదుపు తప్పాయన్న భావన కలిగించేందుకు స్వయంగా చంద్రబాబు, నారా లోకేషే ప్రయత్నించడం… అసలు 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఇలాంటి ప్రచారానికి ఎందుకు దిగుతోంది ?.

ఇటీవల ఎన్నికల్లో ఎదురైన ఓటమి టీడీపీ చరిత్రలో చూడని ఓటమి. ఈ ఓటమి నుంచి కోలుకోవాలంటే ముందు కేడర్‌లో విశ్వాసం నింపాలి. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది.. చంద్రబాబును ఓడించినందుకే ప్రజలు ఇప్పుడు కన్నీరు పెట్టుకుంటున్నారు అన్న భావన తొలుత కేడర్‌లో కలిగించాలి. అప్పుడే కనీసం కేడర్‌ నిలబడగలుతుంది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి… కాబట్టి తక్షణం కేడర్ లో ధైర్యం నింపాల్సిన పరిస్థితి కూడా టీడీపీకి వచ్చింది.

ఇలా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది అన్న భావన కలిగించేందుకు ప్రతిపక్షం మరీ చిన్నచిన్న అంశాలను, చివరకు అసత్యప్రచారాన్ని కూడా ఎందుకు ఆశ్రయిస్తోంది అంటే…. మరో దారి లేదు.

వైసీపీ తరపున 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా వారెక్కడా నోరు పారేసుకోవడం లేదు. దౌర్జన్యాలు చేయడం లేదు. సహజ వనరులు కొల్లగొట్టేందుకు ఇప్పటి వరకు అయితే తెగించలేదు. అవినీతికి ఆస్కారం ఇచ్చేలా ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకోవడం లేదు. గ్రామ సచివాలయం పోస్టులకు ఒకేసారి 20 లక్షల మంది హాజరైనా ఎక్కడా ఒక్క చిన్న ఆరోపణగానీ, విమర్శగానీ రాకుండా పరీక్షలు నిర్వహించారు. సీమలో ఫ్యాక్షన్ హత్యలు లేవు. కుంభకోణాలు లేవు. కాబట్టి ప్రభుత్వంపై ఇప్పటికిప్పుడు సహజంగా వ్యతిరేకత వచ్చే అవకాశం లేకుండాపోయింది.

దాంతో టీడీపీనే స్వయంగా ఒక కృత్తిమ అలజడి వాతావారణాన్ని సృష్టించేందుకే చిన్నచిన్న అంశాలను కూడా పెద్దెత్తున ప్రచారం చేస్తోంది అన్నది అర్థమవుతోంది. పాలనలో జగన్‌ ఎక్కడా దొరకడం లేదు…. కాబట్టే సున్నితమైన మతపరమైన అంశాల ఆధారంగా ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షాలు వెనుకాడడం లేదనిపిస్తోంది.

ఇలాంటి విషయాల్లో బాధ్యత లేని కొన్ని మీడియా సంస్థలు పూర్తి మద్దతు కూడా టీడీపీకి కలిసొచ్చే అంశంగా ఉంది. జగన్‌ ఏదైనా భారీ తప్పిదం చేయడమో, లేదంటే ప్రభుత్వంలో ఏదైనా భారీ కుంభకోణం జరగడమో, ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఏదైనా బలమైన నిర్ణయాలు తీసుకోవడమో చేసే వరకు టీడీపీ ఇలాంటి చిన్నచిన్న అంశాలను, సున్నితమైన అంశాల ఆధారంగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం కొనసాగిస్తుంది అన్నది స్పష్టం. అలా చేయకపోతే టీడీపీ మరింత బలహీనపడే అవకాశం ఉంటుంది. ఆ పార్టీ తనను తాను బతికించుకునేందుకు చేస్తున్న ప్రయత్నం ఇది.