పల్నాడులో శాంతి కోసం ఆళ్లగడ్డ నుంచి అఖిల… పోలీసులపై జులుం

చంద్రబాబు ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి కోడెల శివప్రసాదరావు, యరపతినేని ఉత్సాహంగా ముందుకు రాలేదు గానీ… వివిధ జిల్లాల నుంచి టీడీపీ నేతలు మాత్రం వచ్చారు. పల్నాడులో శాంతి కోసమంటూ ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ కూడా వచ్చారు. విజయవాడలోని ఒక హోటల్‌లో దిగారు.

అక్కడి నుంచి ఆందోళన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె బయలుదేరగా… పోలీసులు అడ్డుకున్నారు. ఛలో ఆత్మకూరుకు అనుమతి లేదని హోటల్ నుంచి బయటకు రావొద్దని కోరారు.

ఈ సమయంలో భూమా అఖిలప్రియ, ఆమె అనుచరులు పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. మహిళా ఎస్‌ఐపై వేలు చూపుతూ మండిపడ్డారు. ”నేనేవరో తెలుసా… నన్నే ఆపుతావా? . మేమంటే ఏమనుకుంటున్నావ్ ”అంటూ ఎస్‌ఐపై దురుసగా ప్రవర్తించారు. మహిళా ఎస్‌ఐతో పాటు వచ్చిన కానిస్టేబుళ్లపై అఖిలప్రియ అనుచరులు గట్టి గట్టిగా అరుస్తూ వెళ్లిపోండి అంటూ వార్నింగ్ ఇచ్చారు.

అఖిలప్రియ, ఆమె అనుచరులు ఒక్కసారిగా వాగ్వాదానికి దిగడంతో మహిళా ఎస్‌ఐ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తనకు పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకే బయటకు అనుమతి ఇవ్వడం లేదని ఎస్‌ఐ చెప్పగా.. ఎవరో చెప్పింది ఫాలో అవుతావా.. ఎవరి కింద పనిచేస్తున్నావ్… అంటూ భూమా అఖిలప్రియ మహిళా ఎస్‌ఐపై జులం ప్రదర్శించారు. పల్నాడులో శాంతి స్థాపించేందుకే ఆళ్లగడ్డ నుంచి వచ్చానని ఆమె చెప్పారు.