వైజాగ్ సెంటిమెంట్ బయటపెట్టిన నాని

సినిమా జనాల్ని, సెంటిమెంట్స్ ను విడివిడిగా చూడలేం. ఈ రెండూ ఎప్పుడూ కాంబో ప్యాక్ లా కలిసే ఉంటాయి. సెంటిమెంట్ కోసం పేర్లు మార్చుకున్న సినిమా వాళ్లు కోకొల్లలు. మరీ ఇంత సెంటిమెంట్ లేకపోయినా తనకు కూడా ఓ సెంటిమెంట్ ఉందని బయటపడ్డాడు నాని. అదే విశాఖ సెంటిమెంట్.

“పది సంవత్సరాలక్రితం వైజాగ్‌ అమ్మాయితో ప్రేమలో పడ్డాను. అప్పటినుండి ఇప్పటి దాకా ఈ సిటీతో లవ్‌లోనే ఉన్నాను. మనోళ్ళు పాటలకి అబ్రాడ్‌ వెళ్తుంటారు…. కానీ ఇంతకంటే మంచి ప్లేస్‌ ఎక్కడుంటుంది చెప్పండి?. ‘అష్టాచెమ్మా’ కి మూడు రోజుల ముందు ప్రీమియర్‌ షో ఇక్కడే జరిగింది. ఎలా గడిచిందో తెలీదు కానీ నా కెరీర్‌ స్టార్ట్‌ చేసి 11 సంవత్సరాలు పూర్తి అయింది . మళ్ళీ ‘గ్యాంగ్‌లీడర్‌’ కి మూడు రోజుల ముందు ఇక్కడ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరుగుతుంది. ఇంకా 11 సంవత్సరాలు సేఫ్‌.”

ఇలా తన వైజాగ్ సెంటిమెంట్ ను బయటపెట్టాడు నాని. గ్యాంగ్ లీడర్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ విశాఖలో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా నాని ఈ వ్యాఖ్యలు చేశాడు. మరోవైపు సినిమాకు ఈరోజు సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. యు/ఏ సర్టిఫికేట్ వచ్చింది. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది గ్యాంగ్ లీడర్.