చంద్రబాబు పోయాకే ప్రశాంతత : ఆత్మకూరు, తురకపాలెం గ్రామస్తులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు పల్నాడు గ్రామాలలో ప్రశాంతత అనేది లేదని, ఆయన సీఎం పదవి నుంచి పోయిన తర్వాతే పల్నాడు ప్రజలు భయం లేకుండా బతుకుతున్నారని పల్నాడులోని… ఆత్మకూరు, తురకపాలెం గ్రామస్తులు చెబుతున్నారు.

తెలుగుదేశం పార్టీ ఛలో ఆత్మకూరు కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంలో ఆయా గ్రామాల్లో రెండు, మూడు ఛానళ్లు, వివిధ పత్రికలకు చెందిన మీడియా ప్రతినిధులు పర్యటించారు. ఆయా ప్రతినిధులతో మాట్లాడిన ఆత్మకూరు, తురకపాలెం గ్రామస్థులు తమ మనసులోని మాటను బయట పెట్టారు.

“చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు ఆత్మకూరు, తురకపాలెం గ్రామాల్లోని ప్రజలందరూ అన్నదమ్ముల్లా కలిసి మెలిసి జీవించే వాళ్లం. చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే మమ్మల్ని మనుషులుగా కాకుండా రాజకీయ పార్టీలకు చెందిన వారిగా చూడడం, మాపై దాడులకు పాల్పడం చేసేవారు. గడచిన మూడు నెలలుగా మేం ప్రశాంతంగా, హాయిగా ఉన్నాం” అని ఆత్మకూరుకు చెందిన ఓ మహిళ స్పష్టం చేశారు.

దివంగత వై.ఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముగిసిపోయిన ఫ్యాక్షన్ గొడవలు… తిరిగి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే వచ్చాయని, గడచిన ఐదు సంవత్సరాలుగా పల్నాడులో తెలుగుదేశం పార్టీ నాయకుల అరాచకమే రాజ్యమేలిందని ఆత్మకూరు గ్రామస్తులు చెప్పారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులూ ఆ పార్టీ నాయకులు పల్నాడులో ప్రశాంతంగా ఉండనివ్వలేదని ఆత్మకూరు కు చెందిన 75 ఏళ్ల వృద్ధుడు పేర్కొన్నారు.

“ఇదేంది అబ్బా. మూడు నెలలుగా గొడవలు లేకుండా మంచిగా ఉండాం. తెలుగుదేశపోళ్లు ఖాళీగా ఉండలేక గొడవలు రేపుతుండారు” అని ఆ వృద్ధుడు స్పష్టం చేశారు.

చాలా రోజులుగా ఆత్మకూరు గ్రామం నుంచి ఎవరు బయటకు పోలేదని, శిబిరంలో ఉన్నది ఎవరో తమకు తెలియదని గ్రామస్తులు మీడియా ప్రతినిధులకు చెప్పారు. ఆత్మకూరు, తురకపాలెం గ్రామాలలో పర్యటించినప్పుడు అక్కడ ప్రశాంత వాతావరణం కనిపించడం విశేషం.

ఆత్మకూరులో బుధవారం ఉదయం ఆరు గంటలకు ఒక ఛానల్ ప్రసారం ప్రత్యక్ష ప్రసారంలో గ్రామానికి చెందిన మహిళలు కల్లాపు చల్లుకోవడం, మరి కొందరు ఇంటి పరిసరాలను శుభ్రం చేయడం కనిపించింది. అలాగే కొందరు వృద్ధులు, యువకులు గ్రామాల్లో వీధుల్లోని అరుగుల మీద కూర్చుని ప్రశాంతంగా చర్చించుకోవడం కనిపించింది.

ఇదే అంశాన్ని మీడియా ప్రతినిధి ఒకరు ఓ యువకుడి వద్ద ప్రస్తావించగా “ఏం జరిగింది సారూ. ఏమి లే. మేం ప్రశాంతంగా ఉండాం. మీరూ, పోలీసులే ఇక్కడికి వచ్చారు. ఏదో సేసేయాలని తెలుగుదేశపోళ్లు వత్తన్నారు” అని అన్నారు.