Telugu Global
NEWS

కొత్తవారికి పువ్వులు.... పాత వారికి ముళ్లు.... గులాబీ గూటిలో అసమ్మతి

గులాబీ గూటిలో అసమ్మతి నివురుగప్పిన నిప్పులా రాజుకుంటోంది. పార్టీ ఓనర్ తో ప్రారంభమైన అసమ్మతి గళం తాజాగా మంత్రివర్గ విస్తరణతో మరింత పుంజుకుంటోంది. పార్టీ జెండా మోసిన వారిని, తెలంగాణ కోసం కష్టపడిన వారిని కాదని, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పదవులను కట్టబెట్టడం…. కొత్తవారికి పువ్వులు.. పాత వారికి ముళ్లు అన్న చందంగా ఉందని పార్టీ నాయకులు అంటున్నారు. కొందరు… మంత్రి పదవులు పొందిన వారిని బహిరంగంగా మీడియా ముందే చులకనగా మాట్లాడడం పార్టీలో చర్చనీయాంశంగా […]

కొత్తవారికి పువ్వులు.... పాత వారికి ముళ్లు.... గులాబీ గూటిలో అసమ్మతి
X

గులాబీ గూటిలో అసమ్మతి నివురుగప్పిన నిప్పులా రాజుకుంటోంది. పార్టీ ఓనర్ తో ప్రారంభమైన అసమ్మతి గళం తాజాగా మంత్రివర్గ విస్తరణతో మరింత పుంజుకుంటోంది. పార్టీ జెండా మోసిన వారిని, తెలంగాణ కోసం కష్టపడిన వారిని కాదని, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పదవులను కట్టబెట్టడం…. కొత్తవారికి పువ్వులు.. పాత వారికి ముళ్లు అన్న చందంగా ఉందని పార్టీ నాయకులు అంటున్నారు.

కొందరు… మంత్రి పదవులు పొందిన వారిని బహిరంగంగా మీడియా ముందే చులకనగా మాట్లాడడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కొత్తగా చేపట్టిన మంత్రి వర్గ విస్తరణలో ఒక్క హరీష్ రావు మినహా మిగిలిన వారిపై అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు సీనియర్ నాయకులు. చివరికి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావుకు మంత్రి పదవి ఇవ్వడంపై కూడా అసమ్మతి వ్యక్తం కావడం గమనార్హం.

ఖమ్మం జిల్లాకు చెందిన పువ్వాడ అజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన సబితా ఇంద్రారెడ్డి, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన సత్యవతి రాథోడ్ లకు మంత్రి పదవులు ఇవ్వడంపై పార్టీ సీనియర్లు గుర్రుగా ఉన్నారు.

జోగు రామన్న వంటి సీరియర్ నాయకులైతే అలక పాన్పు ఎక్కారు. ఆయనతో కార్యనిర్వాహక అధ్యక్షుడు కే.తారక రామారావు ఫొన్ చేసి మాట్లాడినట్లు చెబుతున్నారు. రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న జోగు రామన్న తనకు ఆరోగ్యం బాగోలేదంటూ ప్రకటించారు.

అయితే ఈ అనారోగ్యం వెనుక ఆయన అలకే కారణమని అంటున్నారు. ఈయనతో పాటు మరికొందరు అసంతృప్త ఎమ్మెల్యేలకు కేటీఆర్ ఫొన్లో సంప్రదించేందుకు ప్రయత్నించారని అంటున్నారు. అయితే, చాలా మంది ఎమ్మెల్యేలు కేటీఆర్ తో మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదని సమాచారం.

పార్టీ సీనియర్లు నాయిని నర్శింహారెడ్డి ఇప్పటికే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తే… నగర శాసనసభ్యుడు మాధవరం క్రిష్ణారావు తనకు మంత్రి పదవి ఇవ్వనందుకు ఏకంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు వద్దే తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.

“మీరు నాకు విప్ ఇచ్చారు. దాన్ని ఏం చేసుకోను. కమ్మ కోటాలో పువ్వాడ అజయ్ కి మంత్రి పదవి ఇచ్చారంటున్నారు. ఆ కోటాలోనే అయితే నా కంటే జూనియర్ అయిన పువ్వాడకు మంత్రి పదవి ఎలా ఇస్తారు” అని ప్రశ్నించినట్లు చెబుతున్నారు.

అయితే ఖమ్మం జిల్లా రాజకీయాల్లో భాగంగా పువ్వాడకు మంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చిందని, తగిన సమయంలో మీకు మంచి గుర్తింపు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ సముదాయించేందుకు ప్రయత్నించినట్లు చెబుతున్నారు.

మరోవైపు పువ్వాడకు మంత్రి పదవి దక్కడంపై ఎమ్మెల్యే బాల్క సుమన్ బహిరంగంగానే పువ్వాడను విమర్శించడం పార్టీలో చర్చకు దారి తీసింది.

“కేటీఆర్ చెవులు కొరికి మంత్రి పదవి దక్కించుకున్నారుగా మీరు” అంటూ పువ్వాడ అజయ్ ని బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. ఇది కూడా మీడియా ప్రతినిధుల ముందే జరగడంతో పువ్వాడ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్లుగా చెబుతున్నారు.

ఇక మహిళల కోటాలో మంత్రి పదవులు దక్కని వారు సైతం తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి పార్టీలో ఎన్నో ఆటుపోట్లను భరించిన తమను కాదని నిన్నగాక మొన్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి వచ్చిన సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ లకు మంత్రి పదవులు ఇవ్వడంపై మహిళా శాసనసభ్యురాళ్లు ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు.

భారతీయ జనతా పార్టీ దూకుడుకు కళ్లెం వేయాలని చేపట్టిన మంత్రి వర్గ విస్తరణ తమకే ఇక్కట్లు తెచ్చిపెట్టేలా ఉందని పార్టీ సీనియర్ నాయకులు తమ సన్నిహితుల వద్ద ప్రస్తావిస్తున్నట్లు సమాచారం.

First Published:  10 Sep 2019 10:33 PM GMT
Next Story