ఫోన్ మాట్లాడుతూ పాము కాటుకు బలి

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక మహిళ ఫోన్ మాట్లాడుతూ ఎక్కడ కూర్చుంటున్నదో కూడా తెలియకుండా పాముకాటుకు గురి అయింది. అయితే ఇది ఎక్కడో బయట జరిగిన సంఘటన కాదు. సొంత ఇంటిలో బెడ్ రూమ్ లో, బెడ్ పై జరిగిన సంఘటన కావడం గమనార్హం.

బుధవారం నాడు ఉత్తర ప్రదేశ్, గోరఖ్ పూర్ సమీపంలోని రియాన్వా గ్రామంలో ఈ సంఘటన జరిగింది.
గీత అనే స్త్రీ థాయిలాండ్ లో పనిచేస్తున్న తన భర్త జై సింగ్ యాదవ్ తో ఫోన్లో మాట్లాడుతూ ఇంట్లోనే బెడ్ రూమ్ లోకి ప్రవేశించింది. ఆ బెడ్ పై ప్రింటెడ్ బెడ్ కవర్ కప్పి ఉంది. ఫోన్ లో చిట్ చాట్ చేస్తూనే ఆమె బెడ్ పై కూర్చుంది. కానీ అప్పటికే ఆ బెడ్ పై రెండు పాములు ఉన్నాయి. వాటిని చూసుకోకుండా ఆమె ఆ పాముల పైనే కూర్చున్నది. ఇంకేముంది ఆమె కూర్చున్నందుకు కలిగిన ఒత్తిడిని తట్టుకోలేని పాములు ఆమెను కాటేశాయి. కొన్ని నిమిషాల్లోనే ఆమె స్పృహ కోల్పోయింది.

కుటుంబ సభ్యులు గీతను హడావిడిగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ గీత కొన్ని నిమిషాల్లోనే మరణించింది.
కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగువారు అసలేం జరిగిందో చూద్దామని బెడ్ రూమ్ లోకి వెళ్లి చూస్తే… బెడ్ పై రెండు పాములు కనిపించాయి. కోపంతో ఆ రెండింటిని చంపేశారు. అంటే ప్రింటెడ్ బెడ్ కవర్ ని బెడ్ పై పరచడం వల్ల పైకి చేరిన పాములు ఆ కలర్ డిజైన్ లో కలిసిపోయి ఉండవచ్చు అని, అందువల్లనే కంటికి అవి కనిపించలేదని అక్కడి వారు భావించారు.

బయట అయినా, ఇంట్లో అయినా… సెల్ ఫోన్లో మాట్లాడేటప్పుడు జరంత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే రోడ్డు ప్రమాదాలు ఏమైనా జరగవచ్చు, ఇంట్లో ఏ స్టవ్ దగ్గరో అగ్నిప్రమాద మైనా జరగవచ్చు. పురుగు పుట్ర కాటు కైనా బలి కావచ్చు.