నిత్యపెళ్లికొడుక్కి భార్యల బడిత పూజ !

తమిళనాడులో నిత్యపెళ్లికొడుకు వ్యవహారం బయటపడింది. అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని…మూడో పెళ్లికి రెడీ అయిన భర్తకు భార్యలు బడితపూజ చేశారు. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న నిత్యపెళ్లికొడుకు మరో పెళ్ళికి సిద్ధమయ్యాడు. ఈ విషయం భార్యలిద్దరి చెవిన పడింది. వెంటనే భర్త దగ్గరకు వచ్చి చావబాదారు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది.

కోయంబత్తూరు నెహ్రూ నగర్‌కు చెందిన అరవింద్‌ గణేష్‌కు మొదట ప్రియదర్శినితో వివాహం జరిగింది. పది రోజులకే గొడవలు జరుగడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదిలా ఉండగానే అనుప్రియ అనే యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రహస్యంగా అనుప్రియకు తాళికట్టాడు.

రెండు పెళ్లిళ్లు అయిపోయాయి.. ఇంకెవరూ తనని అడిగేవాడు లేడనుకున్నాడో ఏమో తెలీదు కానీ.. మూడోపెళ్లికి రెడీ అయ్యాడు అరవింద్‌.

ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు భార్యలు అరవింద్‌ గణేష్‌ పని చేస్తున్న చోటుకు వెళ్లి చితక్కొట్టారు. శాడిజంతో తమకు నరకం చూపించాడని బాధితులు ప్రియదర్శిని, అనుప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. గొడవ పెద్దది కావడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. భార్యల ఫిర్యాదు మేరకు అరవింద్‌పై కేసు నమోదు చేశారు.