జగన్ మీడియా వ్యూహం పూర్తిగా విఫలమైంది….

చలో ఆత్మకూరుకు చంద్రబాబు పిలుపునిచ్చిన తీరుపై సీనియర్ జర్నలిస్ట్ సీహెచ్‌ ఎంవీ కృష్ణారావు తప్పుపట్టారు. చంద్రబాబు తీరు గ్రామాల్లో మరింత ఘర్షణ వాతావరణం పెంచేందుకు పనికొస్తుంది కానీ దాని వల్ల ఉపయోగం ఉండదన్నారు. 10వేల మందితో వెళ్లి ఒక గ్రామంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే దాని వల్ల ఆ గ్రామంలో రెండు వర్గాల మధ్య మరింత ఉద్రిక్తత పెరిగే అవకాశం ఉంటుందన్నారు.

చలో ఆత్మకూరు విషయంలో వైసీపీ విఫలమైందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టడానికి ముందే చంద్రబాబు మొత్తం వ్యూహం సిద్ధం చేసుకున్నారని… పోలీసులు అడ్డుకుంటే వెంటనే దీక్షకు దిగాలి.. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ధర్నాలు చేయాలని ముందే వ్యూహం సిద్ధం చేసుకున్నారని వివరించారు.

లోకల్‌ మీడియా నుంచి జాతీయ మీడియా వరకు విపరీత ప్రచారం వచ్చేలా జాగ్రత్త తీసుకున్నారన్నారు. కానీ వైసీపీ నుంచి ఏమాత్రం ప్రతి వ్యూహం లేదన్నది స్పష్టంగా అర్థమవుతోందన్నారు.

గతంతో పోలిస్తే జగన్‌ చుట్టూ మీడియా సలహాదారుల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. జాతీయ. అంతర్జాతీయ మీడియా సలహాదారులను కూడా నియమించుకున్నారని.. లెక్కకు మించి మీడియా సలహాదారులు, పీఆర్‌వోలు, పబ్లిక్ రిలేషన్‌ ఆఫీసర్లు ఉన్నారని.. కానీ చలో ఆత్మకూరును ఎదుర్కొనేందుకు ఏమాత్రం వ్యూహం సిద్ధం చేయలేకపోయారన్నారు.

”అవతలి వాడు చంద్రబాబు” అన్న సోదిలోకి వచ్చి వైసీపీ వ్యూహాలు రచించుకుంటే మంచిదని కృష్ణారావు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు తన వ్యూహంతో, మీడియాను మొత్తం ఆకట్టుకుని జాతీయ మీడియా చానళ్లలో కూడా కవరేజ్ వచ్చేలా చేయడంతో పాటు… ఒక కృత్తిమ ఉద్రిక్తతను సృష్టించడంలో విజయవంతం అయ్యారని ఆయన అభిప్రాయపడ్డారు.

సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారావు అభిప్రాయంతో వైసీపీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి కూడా ఏకీభవించారు. తమ పార్టీ మీడియా సలహాదారులు ఇంకా పూర్తిగా పనికి పూనుకున్నట్టుగా లేదని తామూ కూడా భావిస్తున్నామన్నారు.

చంద్రబాబు జాతీయ మీడియాకు కూడా ప్యాకేజ్‌లు ఇచ్చి మేనేజ్ చేసుకుంటున్నారని.. అందుకే ఆయనకు జాతీయ మీడియా కూడా విపరీత ప్రచారం ఇస్తోందన్నారు. నిన్న జాతీయ మీడియా చంద్రబాబుకు ఇచ్చిన కవరేజ్ తమను కూడా ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు.