Telugu Global
NEWS

బాబు, సుజనా చౌదరి ల చిల్లర వేషాలు గమనిస్తున్నారు...!

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపాల్టీలకు రానున్న డిసెంబర్ నెలలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా మున్సిపల్ కమిషనర్లు, కలెక్టర్లకు మౌఖికంగా ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అంతే కాదు… వివిధ జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ అధికారులకు కూడా మంత్రి బొత్సా తెలిపారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే బాధ్యత మున్సిపల్ కమిషనర్ల పై ఉందని, అయితే చాలా […]

బాబు, సుజనా చౌదరి ల చిల్లర వేషాలు గమనిస్తున్నారు...!
X

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపాల్టీలకు రానున్న డిసెంబర్ నెలలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా మున్సిపల్ కమిషనర్లు, కలెక్టర్లకు మౌఖికంగా ఆదేశాలు కూడా జారీ చేసింది.

ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అంతే కాదు… వివిధ జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ అధికారులకు కూడా మంత్రి బొత్సా తెలిపారు.

ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే బాధ్యత మున్సిపల్ కమిషనర్ల పై ఉందని, అయితే చాలా చోట్ల వారంతా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మంత్రి మండిపడ్డారు.

“ప్రభుత్వ అధికారులకు సెల్ ఫోన్లు ఇచ్చింది. వాటి బిల్లులు కడుతున్నది ప్రభుత్వమే. ప్రజలు ఎప్పుడు ఫొన్ చేసినా కమిషనర్లు స్పందించాలనే ఈ ఫోన్లు ఇచ్చారు. అయితే చాలాచోట్ల కమిషనర్లు తమకిచ్చిన ఫొన్లను సొంతానికి వాడుకుంటున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఫోన్లకు స్పందించడం లేదు” అని మండిపడ్డారు.

డిసెంబర్ నెలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, ఇందుకు అనుగుణంగా కమిషనర్లు ఏర్పాట్లు చేయాలని మంత్రి బొత్సా సత్యనారాయణ అధికారులను ఆదేశించారు.

“చాలా జిల్లాల్లో విలీన గ్రామాల సమస్యలున్నాయి. వాటిని తక్షణమే పరిష్కరించండి. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కండి” అని ఆయన ఆదేశించారు.

రాష్ట్రం శాంతిగా, సుఖంగా, సౌఖ్యంగా ఉండడాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సహించలేకపోతున్నారని మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు.

“ప్రతిపక్షం పెయిడ్ ఆర్టిస్టులతో రాష్ట్రంలో గందరగోళం తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. దీనిని పచ్చ మీడియా ప్రచారం చేస్తోంది” అని మంత్రి బొత్సా మండిపడ్డారు. తన వందరోజుల పాలనతో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మంచి రోజులు తీసుకువచ్చారని, దీనిని సహించలేని చంద్రబాబు నాయుడు చిన్న చిన్న వివాదాలను పెద్దవిగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.

బీజెపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కండువా మార్చుకున్నారే తప్ప ఆయన ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకుడిలాగే వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

“‘సజనా చౌదరి మూలాలు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాయి. ఆయన ఆలోచనలు కూడా ఆ పార్టీకి అనుగుణంగానే ఉన్నాయి. ఆయన అడిగితే ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలా..? ” అని మంత్రి బొత్సా సత్యనారాయణ ప్రశ్నించారు.

చంద్రబాబు నాయుడు, సుజనా చౌదరిల చిల్లర వేషాలను ప్రజలు గమనిస్తున్నారని మంత్రి బొత్సా అన్నారు.

First Published:  13 Sep 2019 12:10 AM GMT
Next Story