కుమార్తె మరో స్త్రీతో సహజీవనం…. తండ్రి గన్ తో కాల్చుకున్నాడు

20 ఏళ్ల తన కుమార్తె మరో స్త్రీతో సహజీవనం చేస్తానని వాదించడంతో మనస్తాపం చెందిన ఓ తండ్రి గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఢిల్లీలోని షాదరా లో బట్టలు ఇస్త్రీ చేసుకుని బతికే 60 ఏళ్ల వృద్ధుడు… తన కుటుంబంతో సహా ఉత్తర ప్రదేశ్ ‘బదాయ్’ నుంచి వలస వచ్చాడు. స్కూల్ చదువు మానేసి తండ్రి పనిలో సహాయం చేస్తూ ఉంటుంది ఈ అమ్మాయి.

షాదరా డిసిపి అమిత్ శర్మ మాట్లాడుతూ… “మంగళవారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఓ స్త్రీ మాకు కాల్ చేసి, తన తండ్రి పొట్టలో తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది. మేము వెంటనే అక్కడికి వెళ్లాం. చనిపోయిన అతడు తన రూమ్ లో కింద పడి ఉన్నాడు. ఈ సంఘటనకు ముందు ఆయన కూతురితో వాగ్వివాదం చేసి బయటికి వెళ్లాడు. ఇరవై నిమిషాల తర్వాత తిరిగి వచ్చి తన గదిలోకి వెళ్లి పొట్టలో కాల్చుకున్నాడట. ఆ సమయంలో అతడి భార్య, కూతురు కూడా ఇంట్లోనే ఉన్నారు”.

ఓ ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ ఆ యువతి వేరే స్త్రీ తో తనకు ఉన్న సంబంధం గురించి, తండ్రి తో జరిగిన గొడవ గురించి చెప్పుకొచ్చింది. తన లైంగిక ప్రవర్తన గురించి తన తండ్రికి తెలుసునని, చిన్నప్పటి నుంచి తెలిసిన ఓ స్త్రీ అంటే ఇష్టమని, ఆ విషయాన్ని తన తండ్రి వ్యతిరేకించారని చెప్పింది.

“నా తల్లిదండ్రులతో నా లైంగిక ప్రవర్తన గురించి చెప్పలేకపోయాను. అందుకే 3 నెలల క్రితం నా భాగస్వామితో కలిసి పంజాబ్ పారిపోయాను. నేను ఎక్కడున్నానో తెలుసుకుని నా తండ్రి వచ్చి నన్ను ఇంటికి తీసుకు వచ్చాడు” అని చెప్పింది.

తోటి స్త్రీతో తన బంధం గురించి చెప్పడంతో ఆమెను కూడా తనతోపాటే ఇంటిలో ఉండనిస్తున్నాడని, కానీ తన భాగస్వామి బయట స్వతంత్రంగా బతుకుదామని చెప్పడంతో… గత మంగళవారం ఇంటి నుంచి బయటికి వెళ్తానని చెప్పానని… అందుకు తన తండ్రి తనను కోపంతో కొట్టాడని, ఆ తర్వాత బయటికి వెళ్లి వచ్చి రూం తలుపు వేసుకుని కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది. ఇలా ఎందుకు చేసుకున్నాడో తనకు అర్థం కావడం లేదని అన్నది.

యువతి సోదరుడు మాట్లాడుతూ… జూన్ లో తన సోదరి ఇల్లు విడిచి వెళ్లడంతో తండ్రి ఆందోళన చెందాడని, ఆమె తిరిగి వచ్చిన తర్వాత తన లైంగిక ప్రవర్తన గురించి చెప్పటంతో అందరం షాక్ కి గురయ్యామని అన్నాడు.

అయినా మేమంతా ఆమెను తిరిగి ఆదరిస్తూ ఇంట్లోనే ఉండమని చెప్పామని, ఆమె భాగస్వామి కూడా రెండు నెలలుగా తమతోనే ఉంటుందని చెప్పాడు. అయితే ఇప్పుడు బయటికెళ్ళి స్వతంత్రంగా జీవిస్తానని చెప్పడంతో కోపగించి తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు అన్నారు. ప్రస్తుతం పోలీసులు కేసును అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు.