మరణం తర్వాత మానవ శవాలు కదులుతాయి

ఎలిసన్ విల్సన్ అనే సైంటిస్టు, ఆమె సహచరులు మనుషుల శవాలు ఒక ఏడాది పాటు కదులుతూ ఉంటాయని గుర్తించారు.

మనిషి మరణించిన తర్వాత మరణ సమయాన్ని కనుగొనడం కోసం నేర పరిశోధనలో టైం లాప్స్ కెమెరాలను వాడుతారు. ఇప్పుడు విల్సన్ బృందం కనుగొన్న ఆశ్చర్యకరమైన విషయాన్ని గమనంలో ఉంచుకుంటే నేర పరిశోధన కచ్చితమైన దారిలో ప్రయాణిస్తుందని అంటున్నారు.

ఆస్ట్రేలియాకు చెందిన ఎలిసన్ విల్సన్… డిటెక్టివ్ లు, పోలీసుల కు ఉపయోగపడే ఆశ్చర్య కరమైన శవాల కదలిక విషయాన్ని బయటపెట్టడంతో నేర పరిశోధన కొత్త పుంతలు తొక్కనున్నది. 17 నెలల పాటు ఒక శవాన్ని గమనిస్తూ విల్సన్ ఫోటోలు తీశారు. వీటి ఆధారంగా శవాలు ఏడాదిపాటు కదులుతూ ఉంటాయని ఆమె కనుగొన్నారు. ఈ సంగతిని శుక్రవారం నాడు ఓ వార్తా సంస్థకు ఆమె వెల్లడించారు.

ఒక కేస్ స్టడీ లో శవం శరీరానికి దగ్గరగా ఉన్న చేతులు కొన్ని రోజుల తర్వాత కాస్త దూరంగా పక్కకు జరిగినట్లు ఆమె గుర్తించారు. “ఈ కదలిక… శరీరం డి కంపోజ్ అవుతూ ఉండటం వల్ల… లిగమెంట్లు కూడా పొడిగా మారటం వల్ల జరిగిందని అనుకుంటున్నాం” అని ఆమె అన్నారు. ప్రతి నెల విమానంలో మూడు గంటలు సిడ్నీకి ప్రయాణించి ఈ ప్రయోగం కొనసాగించారామె.

సిడ్నీ నగరం శివారులోని తుప్పల తో నిండిన ఓ సీక్రెట్ ప్లేస్ లో 70 శవాలతో ఒక ‘బాడీ ఫామ్’ ఉంది. అందులోనే ఒక శవాన్ని ఆమె తన పరిశోధనకు ఎంచుకుంది. ‘ఆస్ట్రేలియన్ ఫెసిలిటీ ఫర్ టొపొనోమిక్ ఎక్స్ పెరిమెంటల్ రీసెర్చ్’ గా పిలిచే ఈ ఫాం లో పోస్టుమార్టం మూమెంట్ పై మంచి రీసెర్చ్ జరుగుతుంది.

విల్సన్, ఆమె కొలీగ్స్ మరణ సమయాన్ని తెలుసుకోవడానికి సాధారణంగా వాడే టైం లాప్స్ కెమెరా సిస్టం ని మరింత మెరుగు పరచడం కోసం పరిశోధన చేసే క్రమంలో… శవాలలో కదలిక ఉంటుందనే విషయం బయటపడింది.

ఆమె పరిశోధనల సారాంశం ఇటీవల ‘ఫోరెన్సిక్ సైన్స్ ఇంటర్నేషనల్: సినర్జీ’ అనే జర్నల్ లో ప్రచురితమయ్యింది.
శవం కదలిక, డి కంపోజిషన్ శాతం పట్ల సరైన అవగాహన ఉంటే… పోలీసులు మనిషి చనిపోయిన సమయాన్ని మరింత కచ్చితంగా చెప్పవచ్చు. పోస్టుమార్టం మూమెంట్ ని బాగా అర్థం చేసుకుంటే మరణానికి కారణాన్ని లేదా క్రైమ్ సీన్ ని సరిగా అర్థం చేసుకోవచ్చని అంటున్నారు.

చిన్నతనం నుంచి తనకు మరణం పట్ల ఆసక్తి ఎక్కువ అని, చనిపోయిన తర్వాత శవం ఎలా నశిస్తుంది అనే విషయం పట్ల ఎప్పుడూ ఆసక్తిగా ఉండేదని విల్సన్ చెప్తున్నారు.