చంద్రబాబు జాతీయ మీడియాను బాగా పండించారు…

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ వైఖరి పట్ల ఆ పార్టీ నేత, మాజీ సీఎస్ ఐవైఆర్‌ కృష్ణారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన టీడీపీ నేతలు మెల్లగా ఏపీ బీజేపీని ఆక్రమిస్తున్న నేపథ్యంలో కృష్ణారావు స్పందించారు.

బీజేపీ ఒక మంచి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటోందని అభిప్రాయపడ్డారు. ఏపీలో టీడీపీ అజెండాను బీజేపీ తన ఎజెండాగా మోస్తూ ముందుకు వెళ్తే 2019లో ఎన్నికల్లో వచ్చిన ఒక సదావకాశాన్ని దుర్వినియోగం చేసుకోవడమే అవుతుందని ట్విట్టర్లో అభిప్రాయపడ్డారు. ఈ ధోరణి వల్ల బీజేపీ ఏపీలో నిర్వీర్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు చలో ఆత్మకూరు కార్యక్రమం పట్ల జాతీయ మీడియా అతిగా స్పందించడం, జాతీయ మీడియా సంస్థల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వారు చంద్రబాబుకు ఏదో అయిపోతోందని ట్వీట్లు చేయడంపైనా ఐవైఆర్ స్పందించారు. చంద్రబాబు జాతీయ మీడియాను బాగా పండించారని వ్యాఖ్యానించారు.