యూరేనియం ఫైట్… టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు సారీ చెప్పిన అనసూయ… అయినా ఆగని ట్రోలింగ్‌…

నల్లమల అడవుల్లో కేంద్ర ప్రభుత్వం యూరేనియం తవ్వకాల కోసం నిర్ణయించడం.. పరిశోధన చేయడానికి వచ్చిన బృందాన్ని స్థానికులు అడ్డుకోవడం జరిగిపోయింది. అదేవిధంగా ఇదేవిషయం పై జనసేనాని పవన్ కల్యాణ్ కూడా కాంగ్రెస్ నేత హనుమంత రావు తో కలిసి మీడియా ముందుకు వచ్చాడు. అదేవిధంగా హీరో విజయ్ దేవరకొండ కూడా ఈ యురేనియం తవ్వకాలు జరపవద్దంటూ కోరారు.

తాజాగా ఈ యుద్ధంలోకి బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ చేరారు. ట్విట్టర్ ద్వారా అనసూయ యూరేనియం వెలికితీతపై ఘాటుగా స్పందించింది. ‘‘కరెంట్ ఉత్పత్తి కోసం చెట్లను నరికి యురేనియం తీస్తారు సరే.. మరి పీల్చే స్వచ్చమైన గాలిని లేకుండా చేసి… ఊపిరి ఆడకపోతే ఏం చేస్తారు.?’’ అంటూ అనసూయ నిలదీసింది.

అంతేకాదు.. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జవదేకర్, ఏపీ అటవీ మంత్రి బాలినేని, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగురామన్నను ట్యాగ్ చేసింది.

అయితే జోగురామన్న తెలంగాణ అటవీశాఖ మంత్రి అనుకొని ఈ పనిచేసింది. కానీ ఆయనకు రెండో దఫా మంత్రి పదవి దక్కలేదు. ప్రస్తుతం తెలంగాణ అటవీశాఖ మంత్రిగా ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారు. ఈ తప్పు తెలుసుకున్న అనసూయ జోగురామన్నకు సారీ చెప్పి చర్యలు తీసుకోవాలని తెలంగాణ అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కోరింది.

అయితే అనసూయ సారీ చెప్పినా సోషల్ మీడియాలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అమెపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.