జస్టిస్‌ ఈశ్వరయ్యకు కీలక బాధ్యతలు

ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వంగాల ఈశ్వరయ్యకు ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించనుంది. రాష్ట్రంలోని విద్యారంగంలో సమూల మార్పులు తెచ్చే ఉద్దేశంతో తెచ్చిన ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌గా వంగాల ఈశ్వరయ్యను నియమించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌ను సంప్రదించిన తర్వాత ఈశ్వరయ్యపేరును ప్రభుత్వం ఓకే చేసింది. త్వరలోనే ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి.

ఈ కమిషన్‌లో చైర్మన్‌తో పాటు ఇద్దరు ప్రొఫెసర్లు, ఉన్నత విద్యాసంస్థ ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. ఈ కమిషన్‌ పరిధిలోకి జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్‌ కాలేజీలు, ప్రైవేట్, డీమ్డ్‌ యూనివర్సిటీలు వస్తాయి.

ప్రవేశాలు, ఫీజులు, బోధన, పరీక్షలు, పరిశోధన, సిబ్బంది అర్హతలు, నిబంధనల మేరకు మౌలిక సదుపాయాలు ఉన్నాయా? లేదా? తదితర అంశాలన్నిటినీ ఈ కమిషన్‌ పర్యవేక్షిస్తుంది. ఈ కమిషన్‌కు సివిల్‌ కోర్టుకు ఉండే అధికారులు ఉంటాయి. ప్రమాణాలు, నిబంధనలు పాటించని విద్యా సంస్థలపై చర్యలకు ఆదేశాలిస్తుంది. అలాగే గుర్తింపు రద్దునకు సైతం ఆదేశాలు జారీ చేస్తుంది. పరిస్థితిని బట్టి జరిమానాలు కూడా విధిస్తుంది.

జస్టిస్‌ ఈశ్వరయ్య బీసీలకు జరిగిన అన్యాయంపై గళమెత్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైకోర్టు న్యాయమూర్తులుగా బీసీ న్యాయవాదులు నియమితులు కాకుండా వారికి వ్యతిరేకంగా రిపోర్టు పంపించినట్టు ఆ అంశాన్ని బహిరంగంగానే జస్టిస్ ఈశ్వరయ్య ఎండగట్టారు.

జస్టిస్ ఈశ్వరయ్య మీడియా ముందుకు వచ్చిన తర్వాతే…. చంద్రబాబు బీసీ న్యాయవాదులు న్యాయమూర్తులు కాకుండా కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపిన అంశం వెలుగులోకి వచ్చింది.