పోతిరెడ్డిపాడు సామర్థ్యం రెట్టింపుకు జగన్ నిర్ణయం

తాజాగా సాగునీటి ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌ తీసుకున్న నిర్ణయంపై రాయలసీమ వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

ప్రకాశం బ్యారేజ్‌కు దిగువన మూడు బ్యారేజ్‌లు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించిన జగన్‌.. అదే సమయంలో రాయలసీమ ప్రాంతానికి నీటి తరలింపుపై ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి పూనుకున్నారు. వరద వస్తున్నా రాయలసీమ ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో నీరు అందకపోవడంతో జగన్‌ అధికారులను ఆరా తీశారు.

ప్రస్తుతం రాయలసీమ ప్రాజెక్టులకు 120 రోజుల వ్యవధిలో వరద జలాలు తరలించే సామర్థ్యంలో కాలువలు ఉన్నాయని అధికారులు వివరించారు. దాని వల్ల భారీగా వరద వచ్చినా… నీటిని తక్కువ సమయంలో రాలయసీమకు ఎక్కువగా తరలించే అవకాశం లేకుండాపోయిందని వివరించారు.

ఇందుకు స్పందించిన ముఖ్యమంత్రి కృష్ణా నదికి 120 రోజుల వరద వస్తుందన్న అంచనాలను సవరించి… 30 నుంచి 40 రోజుల్లోనే వరద జలాలతో రాయలసీమ ప్రాజెక్టులను నింపేలా ప్రణాళిక సిద్దం చేయాలని ఆదేశించారు.

తొలిసారిగా పోతిరెడ్డిపాడు ద్వారా 44వేల క్యూసెక్కుల నీటిని తరలించగలిగామని అధికారులు వివరించారు. ఇందుకు స్పందించిన ముఖ్యమంత్రి… 30, 40 రోజుల్లోనే రాయలసీమ ప్రాజెక్టులు నిండేలా ప్రాజెక్టులను విస్తరించాలని నిర్ణయించారు.

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కుల నుంచి 80వేల క్కూసెక్కులకు పెంచేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. హంద్రీనీవా సుజల స్రవంతి కెనాల్ సామర్థ్యాన్ని 3850 నుంచి 6000వేలకు పెంచేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యం దాదాపు రెట్టింపు చేసే అంశంపై తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా కలిసి చర్చిస్తామని జగన్‌ చెప్పారు.

పోతిరెడ్డి పాడు సామర్థ్యం తొలుత 8వేల క్కూసెక్కులు మాత్రమే ఉండేది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి దాన్ని 44వేల క్కూసెక్కులకు పెంచారు. దాంతో రాయలసీమకు ఇప్పుడు కొద్దిమేరనైనా జలాలు అందుతున్నాయి.

ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను తక్షణం పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు జగన్. ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల నిర్మాణంలో ఒడిషా నుంచి ఎదురవుతున్న అభ్యంతరాలను పరిష్కరించేందుకు ఒడిషా సీఎంతో తాను మాట్లాడుతానని జగన్ చెప్పారు.